ధోనిని అవమానించిన పాక్‌ మంత్రి

12 Jul, 2019 21:45 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓడిపోవడం పట్ల పాకిస్తాన్‌ మంత్రి ఫావాద్‌ హుస్సెన్‌ చౌదరీ రాక్షసానందం పొందుతున్నాడు. కివీస్‌ చేతిలో టీమిండియా ఓడిపోవడానికి అన్ని విధాల అర్హమైనదే అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా టీమిండియా సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోనిపై ఓ నెటిజన్‌ చేసిన వివాదస్పద ట్వీట్‌కు ఫావద్‌ రీట్వీట్‌ చేశాడు. ‘జెంటిల్‌మెన్‌ ఆటను బెట్టింగ్‌, పక్షపాత ధోరణితో ధోని కలుషితం చేశాడు. అందుకే చాలా అవమానకరమైన రీతిలో క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నాడు. తగిన శాస్తి జరిగింది’అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. దీనికి ‘పాకిస్తాన్‌కు కొత్త నేస్తం న్యూజిలాండ్‌’అంటూ ఫావద్‌ రీట్వీట్‌ చేశాడు.   

ప్రస్తుతం పాక్‌ మంత్రి చేసిన ట్వీట్‌ నెట్టింట్లో తెగ ట్రోలింగ్‌ అవుతోంది. ఫావద్‌పై క్రీడాభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘మాడ్రన్‌ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయన్ని లిఖించిన ధోనిని విమర్శించే హక్కు ఎవరికీ లేదు’, ‘న్యూజిలాండ్‌ స్పెల్లింగ్‌(ఇంగ్లీష్‌లో) కూడా తెలియని వ్యక్తి పాకిస్తాన్‌కు మంత్రి’, ‘మరోసారి కుక్క బుద్ది చూపించుకున్నాడు’,‘క్రికెట్‌ గురించి తెలియనోడు కూడా మాట్లాడుడేనా? కర్మరా నాయనా’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక గతంలో టీమిండియా ఆర్మీ క్యాప్‌లు ధరించి మ్యాచ్‌ ఆడటంపై కూడా ఫావద్‌ చౌదరీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు