పాకిస్తాన్‌ ఘనవిజయం

20 Oct, 2018 01:55 IST|Sakshi

రెండో టెస్టులో 373 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా

మళ్లీ విజృంభించిన అబ్బాస్‌

సిరీస్‌ 1–0తో పాక్‌ వశం

అబుదాబి: పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ మళ్లీ విజృంభించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ 373 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు ‘డ్రా’ కాగా... చివరి టెస్టులో గెలిచి పాక్‌ 1–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో (5/33) అదరగొట్టిన అబ్బాస్‌ రెండో ఇన్నింగ్స్‌ (5/62)లోనూ చెలరేగడంతో ఆసీస్‌ కుప్పకూలింది. 538 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్‌ స్కోరు 47/1తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ 49.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. అబ్బాస్‌తో పాటు స్పిన్నర్‌ యాసిర్‌ షా (3/45) చెలరేగడంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. లబ్‌షేన్‌ (43), హెడ్‌ (36) ఫించ్‌ (31)లకు మంచి ఆరంభాలు లభించినా... వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడంలో విఫలమయ్యారు. రెండు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీసిన అబ్బాస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారాలు దక్కాయి. అంతకుముందు గురువారం మూడో రోజు ఆటలో పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 400 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. అజహర్‌ అలీ (64; 4 ఫోర్లు), బాబర్‌ ఆజమ్‌ (99; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (81; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.  

ఇలా కూడా రనౌట్‌ అవుతారా?
ఈ మ్యాచ్‌లో అరుదైన రనౌట్‌ చోటు చేసుకుంది. తాను బాదిన బంతి బౌండరీ దాటిందనే ధీమాతో బ్యాట్స్‌మన్‌ పిచ్‌ మధ్యలో నాన్‌స్ట్రయికర్‌తో ముచ్చటిస్తున్న సమయంలో... బౌండరీకి ముందే ఆగిపోయిన బంతిని ఫీల్డర్‌ అందుకొని వికెట్‌ కీపర్‌కు విసరగా... అతను ఎంచక్కా వికెట్లు గిరాటేశాడు. దీంతో బ్యాట్స్‌మన్‌ తెల్లముఖం వేసి వెనుదిరగాల్సి వచ్చింది. గురువారం మూడో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌ 53వ ఓవర్‌ మూడో బంతిని అజహర్‌ అలీ థర్డ్‌ మ్యాన్‌ దిశగా షాట్‌ ఆడాడు. ఆ బంతి కాస్తా బౌండరీ దగ్గర వరకూ వెళ్లి ఆగింది. ఇది గమనించని అజహర్‌ నాన్‌ స్ట్రయికర్‌ అసద్‌తో కలిసి పిచ్‌ మధ్యలో ముచ్చటిస్తున్నాడు. ఇదే అదునుగా భావించిన ఫీల్డర్‌ స్టార్క్‌ బంతిని కీపర్‌ పైన్‌కు అందించడం... అతను వికెట్లు పడగొట్టడం చకచకా జరిగిపోయాయి. దీంతో షాక్‌కు గురైన అజహర్‌ భారంగా పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు