అతను హిందూ కాబట్టే వివక్ష : అక్తర్‌

27 Dec, 2019 11:16 IST|Sakshi

కరాచీ:  తాను క్రికెట్‌ ఆడిన రోజుల్లో పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఎంతటి వివక్ష ఉండేదో ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తాజాగా వెల్లడించాడు. పాకిస్తాన్‌ జట్టులో చాలా మంది ఆటగాళ్లలో మతం, కులం, ప్రాంతం అనే వివక్ష ఎక్కువగా కనబడేదని విమర్శించాడు. ఈ క్రమంలోనే మాజీ ఆటగాడైన దానిష్‌ కనేరియాపై వివక్ష చూపెట్టేవారన్నాడు. తన సహచర క్రికెటరైన కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నాడు. చివరకు అతనితో కలిసి భోజనం చేయడానికి కూడా అయిష్టత చూపెట్టడం తాను చూశానన్నాడు. ఇక్కడ మొత్తం జట్టు అంతా అలా ఉండేది కానీ, మెజార్టీ సభ్యులు మాత్రమే వివక్ష చూపెట్టేవారన్నాడు.

‘ నా కెరీర్‌లో కొంతమంది పాక్‌ క్రికెటర్లు వివక్షకు పెద్ద పీట వేసేవారు. ఎప్పుడూ నీ మతం ఏమిటి, ప్రాంతం ఏమిటి అనే దానిపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. నువ్వు కరాచీకి చెందిన వాడివా.. పంజాబ్‌కు చెందిన వాడివా.. పెషావర్‌కు చెందిన వాడివా అనే విషయాలను ఆరా తీస్తూ ఉండేవారు. ప్రత్యేకంగా ముగ్గురు క్రికెటర్లకు ఇదే పని. ఈ క‍్రమంలోనే కనేరియా ఎక్కువ అవమానించ బడ్డాడు. ఆ హిందూ వల్లే  ఇంగ్లండ్‌పై మేము టెస్టు గెలిచాం. ఇంగ్లండ్‌పై పాకిస్తాన్‌ విజయం సాధించడంలో కనేరియా కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో కనేరియా జట్టులో లేకపోతే మేము కచ్చితంగా మ్యాచ్‌ను కోల్పోయే వాళ్లం. కానీ అతనికి దక్కాల్సిన క్రెడిట్‌ ఇవ్వలేదు’ అని షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు.

దీనిపై కనేరియాను సంప్రదించగా అదే నిజమేనని ఒప్పుకున్నాడు. ‘షోయబ్‌ అక్తర్‌ ఒక లెజెండ్‌. నాకు ఎప్పుడూ అక్తర్‌ మద్దతుగానే ఉండేవాడు. కానీ ఆ సమయంలో నాపై వివక్ష చూపెట్టేవారిని ఎదురించే సాహసం చేయలేకపోయా అక్తర్‌తో పాటు ఇంజమాముల్‌ హక్‌, మహ్మద్‌ యూసఫ్‌, యూనస్‌ ఖాన్‌లు నాకు అండగా ఉండేవారు. కానీ ఎవరైతే నాకు మద్దతుగా లేరో వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తాం.  నాకు పాకిస్తాన్‌ తరఫున ఆడటం అదృష్టమే కాకుండా గొప్ప గౌరవంగా భావిస్తా’ అని కనేరియా చెప్పాడు. పాకిస్తాన్‌ తరఫున క్రికెట్‌ ఆడిన రెండో హిందూ క్రికెటర్‌ కనేరియా. అతని మేనమామ అనిల్‌ దల్పత్‌ పాకిస్తాన్‌కు ఆడిన తొలి హిందూ క్రికెటర్‌ కాగా, కనేరియా రెండోవాడు.పాకిస్తాన్‌ తరఫున 61 టెస్టులు ఆడిన కనేరియా 261 వికెట్లు సాధించగా, వన్డేల్లో కేవలం 18 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 15 వికెట్లు తీశాడు.

>
మరిన్ని వార్తలు