జర్మనీ జయకేతనం

15 Dec, 2014 01:02 IST|Sakshi
జర్మనీ జయకేతనం

చాంపియన్స్ ట్రోఫీ కైవసం
 ఫైనల్లో పాక్‌పై గెలుపు

 
 భువనేశ్వర్: టోర్నీ మొత్తం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఒలింపిక్ చాంపియన్ జర్మనీ జట్టు... చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఆదివారం కలింగ మైదానంలో జరిగిన ఫైనల్లో 2-1తో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. 2007 తర్వాత మరోసారి టైటిల్‌ను సాధించిన జర్మనీకి ఓవరాల్‌గా ఇది పదో ట్రోఫీ. వెస్లీ (18వ ని.), ఫ్లోరియన్ ఫుచ్స్ (57వ ని.) జర్మనీకి గోల్స్ అం దించారు. తొలి నిమిషంలోనే పెనాల్టీని సాధిం చిన జర్మనీ మ్యాచ్ మొత్తం దూకుడును ప్రదర్శించింది. ప్రథమార్ధం ముగిసేసరికి 1-0 ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధభాగంలో పాక్ కాస్త పోరాడినా గోల్స్ చేయలేకపోయింది.
 
 భారత్‌కు నాలుగో స్థానం
 32 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో పతకం గెలుచుకునే మంచి అవకాశాన్ని భారత హాకీ జట్టు జారవిడుచుకుంది. ఆదివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 1-2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
 
 1982లో కాంస్యం సాధించిన భారత్... కనీసం ఈసారి కూడా దాన్ని పునరావృతం చేస్తే బాగుంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. లలిత్ ఉపాధ్యాయ (42వ ని.) భారత్‌కు ఏకైక గోల్ అందిస్తే... ఎడి ఒకెన్‌డెన్ (18వ ని.), మాట్ గోడెస్ (52వ ని.)లు ఆసీస్ తరఫున చెరో ఫీల్డ్ గోల్ సాధించారు. నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఇంగ్లండ్, బెల్జియం వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి.
 
 ఇద్దరు పాక్ ఆటగాళ్లపై వేటు
 సెమీస్‌లో భారత్‌పై గెలిచాక ప్రేక్షకులకు అసభ్య కరంగా సంజ్ఞలు చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లపై అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఒక మ్యాచ్ నిషేధం విధించింది. ఆ ఘటనలో దోషులుగా తేలిన అంజద్ అలీ, మొహమ్మద్ తౌసీఖ్‌లను జర్మనీతో ఫైనల్ ఆడకుండా నిషేధించింది. తొలుత వీరిని హెచ్చరించి వదిలేసినా... వాళ్లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో భారత్‌లో అం తర్జాతీయ టోర్నీలు నిర్వహించబోమని హాకీ ఇండియా హెచ్చరించింది. దీంతో ఎఫ్‌ఐహెచ్ చర్యలు తీసుకుంది. సెమీస్ తమ ప్రవర్తన పట్ల ఫైనల్ అనంతరం పాక్ కోచ్, కెప్టెన్ గులాబీలు ప్రదర్శిస్తూ క్షమాపణలు కోరారు.
 

>
మరిన్ని వార్తలు