పాక్ నుంచి ఏడుగురే..

3 Aug, 2016 09:23 IST|Sakshi
పాక్ నుంచి ఏడుగురే..

ఒలింపిక్స్‌కు అతి చిన్న బృందం  
 కరాచీ: ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవడంతో పాటు నిధులు మంజూరు చేయడంలో అలసత్వం.. అధికారుల అవినీతి అన్నీ కలసి పాకిస్తాన్ క్రీడారంగాన్ని వెనక్కి లాగుతున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈసారి ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ అతిచిన్న బృందాన్ని బరిలోకి దించడమే.

ప్రపంచ స్థాయి క్రికెటర్లు, హాకీ ప్లేయర్లు, స్క్వాష్ చాంపియన్లను అందించిన పాకిస్తాన్.. స్వాతంత్య్రం పొందాక 1980 మినహా ప్రతి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. అయితే ఈసారి అతి తక్కువ సంఖ్యలో 7 మంది మాత్రమే పాక్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మెగా ఈవెంట్స్‌లో పాక్ ఇప్పటివరకు 10 ఒలింపిక్ పతకాలు సాధించింది. వాటిలో ఎనిమిది హాకీలో పొందితే.. రెండు వ్యక్తిగత పతకాలు.
 
ప్రస్తుతం ఏడుమందితోనే..
1948లో తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న పాక్.. ఈసారి ఏడు మందితోనే బరిలోకి దిగుతోంది. వారిలో ముగ్గురు మాత్రమే అర్హత టోర్నీల్లో పాల్గొని బెర్తు దక్కించుకోగా.. మిగిలిన నాలుగు బెర్తులు అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓసీ) వైల్డ్‌కార్డు అందించడం ద్వారా దక్కాయి. వైల్డ్‌కార్డు బెర్తులు ప్రతి దేశానికి లభిస్తాయి.
 
హాకీలో వెనకడుగు..
మన హాకీకి ఉన్నంత ఘనచరిత్ర పాక్ హాకీకి కూడా ఉంది. ఆ జట్టు 8 ఒలింపిక్ పతకాలు నెగ్గగా వాటిలో 3 స్వర్ణాలు కూడా ఉన్నాయి. చివరగా ఆ విభాగంలో 1992లో కాంస్యం నెగ్గింది. 2008 నుంచి ఆ జట్టు ఆటతీరు దిగజారింది. ఆ ఏడాది ఎనిమిదో స్థానంలో, 2012లో 7వ స్థానంలో నిలిచిన పాక్.. ఈసారి కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది.
 
నిధుల కొరత..
వివిధ క్రీడా అసోసియేషన్లకు పాకిస్తాన్ ప్రభుత్వం నిధులు అందించడంలో అలసత్వం ప్రదర్శించడం కూడా ఈ పరిస్థితి కారణమైంది. నిధులను కూడా అడ్డదిడ్డంగా కేటాయించడం, అధికారుల అవినీతి సమస్యలతో సమర్థులైన అథ్లెట్లకు అవి చేరడం లేదు. 2012లో బాక్సింగ్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఒక్కో అథ్లెట్‌కు 3 లక్షల డాలర్లు అందించింది.

ఇప్పుడు అర్హత పొందిన వారికి కేవలం 3 వేల డాలర్లు మాత్రమే అందించే స్థితిలో ఉందని ఆ దేశ బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు చెప్పాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆ దేశానికి రజతం అందించిన బాక్సర్ మహమ్మద్ వసీమ్.. ప్రోత్సాహం అందకపోవడంతో ప్రొఫెషనల్‌గా మారాడు.
 
 నేరుగా అర్హత పొందినవారు:
గులామ్ ముస్తఫా బషీర్, మిన్హల్ సొహైల్ (షూటింగ్), హుస్సేన్ షా (జూడో)
వైల్డ్‌కార్డు ఎంట్రీలు: లియానా స్వాన్, హారీస్ బాండే (స్మిమ్మర్లు), మెహబూబ్ అలీ (పురుషుల 400మీ. పరుగు), నజ్మా పర్వీన్ (మహిళల 400మీ.పరుగు).
 
ఒక్కడి మీదే ఆశలు..
రియో ఒలింపిక్స్‌లో పాక్ ప్రజల ఆశలన్నీ జూడో క్రీడాకారుడు షా హుస్సేన్ షాపైనే ఉన్నాయి. 1988లో దేశానికి బాక్సింగ్‌లో కాంస్యం అందించిన హుస్సేన్ షా కొడుకే ఇతడు. షా ప్రస్తుతం టోక్యోలో శిక్షణ తీసుకుంటున్నాడు.
 

>
మరిన్ని వార్తలు