ఆసియాకప్‌ : 162కే పాక్‌ ప్యాకప్‌

19 Sep, 2018 20:14 IST|Sakshi

భారత్‌ లక్ష్యం 163

రాణించిన భువనేశ్వర్‌, జాదవ్‌

దుబాయ్‌ : ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చెలరేగారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. పార్ట్‌టైం బౌలర్‌ కేదార్‌ జాదవ్‌ (3/23), పేసర్లు భువనేశ్వర్‌(3/15), బుమ్రా(2/23)ల దెబ్బకు దాయాదీ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పాక్‌ 43.1 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌.. భువనేశ్వర్‌ దెబ్బకు ఆదిలోనే ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌(2), ఫఖర్‌ జమాన్‌(0)ల వికెట్లను కోల్పోయింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన షోయబ్‌ మాలిక్‌, బాబర్‌ ఆజమ్‌లు ఆచితూచి ఆడుతూ పాక్‌ ఇన్నింగ్స్‌ను గట్టెక్కించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం బాబర్‌ ‌(47)ను కుల్దీప్‌ ఔట్‌ చేసి విడదీశాడు. 

భారత అద్భుత ఫీల్డింగ్‌..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌(6)ను మనీష్‌ పాండే అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌ పంపించగా.. అంబటి రాయుడు సూపర్‌ త్రో తో షోయబ్‌ మాలిక్‌(43)ను రనౌట్‌ చేశాడు. దీంతో పాక్‌ 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే జాదవ్‌ అసిఫ్‌ అలీ(9), షాదాబ్‌ఖాన్‌ (8)లను ధోని అద్భుత కీపింగ్‌ సాయంతో పెవిలియన్‌కు చేర్చాడు. 121 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్‌కు అష్రఫ్, మహ్మద్ అమిర్ సాయంతో వికెట్లు పోకుండా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా అష్రఫ్‌(21)ను ఔట్‌ చేసి దెబ్బకొట్టాడు. చివర్లో భువనేశ్వర్‌ హసన్‌ అలీ(1), బుమ్రా ఉస్మాన్‌ఖాన్‌ను గోల్డెన్‌ డక్‌ చేయడంతో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత బౌలర్లలో కేదార్‌ జాదవ్‌ 3, భువనేశ్వర్‌ 3, కుల్‌దీప్‌ 1, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు.

మరిన్ని వార్తలు