ఆసియాకప్‌: భారత్‌ లక్ష్యం 238

23 Sep, 2018 20:26 IST|Sakshi

రాణించిన భారత బౌలర్లు

హాఫ్‌ సెంచరీతో మెరిసిన షోయబ్‌ మాలిక్‌

దుబాయ్‌: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 238 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌ షోయబ్‌ మాలిక్‌ (78), సర్ఫరాజ్‌ అహ్మద్‌ (44), ఫకార్‌ జమాన్‌ (31), అసీఫ్‌ అలి(30)లు రాణించడంతో ఆ జట్టు గౌరవ ప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను భారత స్పిన్నర్లు చహల్‌, కుల్దీప్‌లు ఆదిలోనే దెబ్బకొట్టారు. 55 పరుగులకే ఇమామ్‌ ఉల్‌ హక్‌(10), ఫకార్‌ జమాన్‌(31)లను పెవిలియన్‌కు చేర్చారు. ఆ వెంటనే బాబర్‌ ఆజమ్‌(9) సమన్వయలోపంతో రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో 58 పరుగులకే పాక్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టల్లో పడింది.

ఆదుకున్న మాలిక్‌- సర్ఫరాజ్‌..
ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మాలిక్‌, సర్ఫరాజ్‌లు ఆచితూచి ఆడుతూ పాక్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. ఈ క్రమంలో 64 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో మాలిక్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను కుల్దీప్‌ చక్కటి బంతితో సర్ఫరాజ్‌ (44)ను ఔట్‌ చేసి విడగొట్టాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరికొద్ది సేపటికే పాక్‌ షోయబ్‌ మాలిక్‌, అసిఫ్‌ అలీల వికెట్లు కోల్పోయింది. అసిఫ్‌ అలీ(30)ని క్లీన్‌ బౌల్డ్‌ చేసిన చహల్‌కు ఇది వన్డేల్లో 50వ వికెట్‌ కావడం విశేషం.  చివరి ఓవర్లో బుమ్రా షాదాబ్‌(10)ను ఔట్‌ చేయడంతో పాక్‌ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. భారత్‌ బౌలర్లలో చహల్‌, కుల్దీప్‌, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.

మరిన్ని వార్తలు