విరాట్ సేనకు భారీ లక్ష్యం

18 Jun, 2017 19:22 IST|Sakshi
విరాట్ సేనకు భారీ లక్ష్యం

లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ భారత్ తో జరుగుతున్న టైటిల్ పోరులో పాకిస్తాన్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ ఓపెనర్లు ఫకార్ జమాన్(114;106బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్ అలీ(59;71బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్)లతో పాటు బాబర్ అజమ్(46;52 బంతుల్లో 4 ఫోర్లు), మొహ్మద్ హఫీజ్(57 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్సర్లు) లు మెరిసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు జమాన్, అజహర్ అలీలు శుభారంభం అందించారు.  ఈ జోడి తొలి వికెట్ కు 128 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే ముందు అజహర్ అలీ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై జమాన్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే ఆపై వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడే క్రమంలో అలీ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆపై జమాన్ కు జత కలిసిన ఫస్ట్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే బాబర్-జమాన్ లు జోడి72 పరుగులు జత చేసింది. దాంతో పాకిస్తాన్ 33.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది.

 

అటు తరువాత పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్(12)నిరాశపరిచినప్పటికీ, బాబర్ అజమ్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి కొ్ద్ది దూరంలో నాల్గో వికెట్ గా అజమ్ అవుటయ్యాడు. కాగా, ఆపై మొహ్మద్ హఫీజ్ సైతం చెలరేగి ఆడటంతో పాకిస్తాన్ జట్టు మూడొందల మార్కును అవలీలగా దాటింది. ఇమాద్ వసీం(25 నాటౌట్; 21 బంతుల్లో 1 ఫోర్, 1సిక్సర్) తో కలిసి  71 పరుగులు జత చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్లు తలో వికెట్ తీశారు.