ఆఫ్రిది... నిజం చెప్పేశాడు! 

3 May, 2019 04:40 IST|Sakshi

పుట్టింది 1975లోనే... 1980లో కాదట

ఆత్మకథలో అసలు వయసు చెప్పిన పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌  

న్యూఢిల్లీ: అనుమానాలున్నా.... ఇన్నాళ్లూ ఎవరికీ అంతు చిక్కనిదిగా మిగిలిన పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది అసలు వయసు ఎంతో ఇప్పుడు బయటపడింది. అది కూడా స్వయంగా అతడి రాతల్లోనే తేలిపోయింది. ఆఫ్రిది ఆత్మకథ ‘గేమ్‌ చేంజర్‌’ ఇటీవల భారత్, పాకిస్తాన్‌లలో విడుదలైంది. అందులో 1996లో శ్రీలంకపై 37 బంతుల్లోనే చేసిన సెంచరీని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, తాను 1975లో పుట్టినట్లు పేర్కొన్నాడు. ఇందులో తేదీని మాత్రం ప్రస్తావించలేదు. వాస్తవానికి క్రికెట్‌లో కొనసాగినన్నాళ్లు ఆఫ్రిది పుట్టింది 1980 మార్చి 1న అని రికార్డుల్లో ఉండేది.

కానీ, అతడి ఆకారం చూసి వయసు ఇంకా ఎక్కువే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. తాజాగా ఆత్మకథ ప్రకారం ఆఫ్రిది ఐదేళ్ల వయసు దాచినట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్‌ తరఫున అతడు 2015లో చివరి వన్డే, 2018లో చివరి టి20 ఆడాడు. ఆత్మకథ లెక్కల ప్రకారం... ప్రస్తుతం 45వ పడిలో ఉన్న ఆఫ్రిది... 40 ఏళ్ల వయసు దాటాక కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినట్లు స్పష్టమవుతోంది.   

మరిన్ని వార్తలు