కెప్టెన్సీ నుంచి దిగను గాక దిగను!

3 Feb, 2017 16:15 IST|Sakshi
కెప్టెన్సీ నుంచి దిగను గాక దిగను!

కరాచీ:ఇప్పటికే అనేక అంతర్గత సమస్యలతో సతమవుతున్న పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో మరో సరికొత్త ముసలం మొదలైంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ నియమించాలనే ప్రయత్నంలో ఉన్న పీసీబీకి ఆ దేశ టెస్టు సారథి మిస్బావుల్ హక్ ఊహించని ఝలక్ ఇచ్చాడు. పాక్ టెస్టు కెప్టెన్సీ నుంచి మిస్బాను తప్పుకోమని కోరగా, దానికి  ఆ వెటరన్ క్రికెటర్ ఒప్పుకోలేదు. దాంతో పాటు తాను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలంటూ పీసీబీని ప్రశ్నించాడు. తాను ఫిట్ గా ఉన్న క్రమంలో జట్టు నుంచి తప్పుకోమంటూ సంకేతాలు పంపడం ఏమిటని నిలదీశాడు. గతంలో కెప్టెన్సీ ని తప్పుకుంటానంటూ పీసీబీకి మిస్బా పదే పదే విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు మిస్బా అవసరం జట్టుకు చాలా ఉందని భావించిన పీసీబీ.. ఆ మేరకు అతన్ని బతిమాలి మరీ టెస్టు కెప్టెన్ గా ఉండేలా చేసింది. ఈ ప్రయత్నంలో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ముఖ్య భూమిక పాత్ర పోషించారు. ప్రస్తుతం మిస్బా తాను జట్టులో కొనసాగడంతో పాటు కెప్టెన్ గా ఉంటానని అంటుంటే, పీసీబీ మాత్రం ఇక చాలు అంటూ సాగనంపే ప్రయత్నం చేస్తోంది.

'నన్ను ఎల్లగొట్టేందుకు ప్రయత్నం జరుగుతుంది. నేను ఫిట్గానే ఉన్నసమయంలో నన్ను వీడ్కోలు చెప్పమంటున్నారు. ఇక్కడ వయసు అనేది ప్రధానం కాదు.. ఫిట్ నెస్ అనేదే ముఖ్యం. నేను చాలా ఫిట్ గా ఉన్నా. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో వీడ్కోలు చెప్పే యోచన లేదు. త్వరలో జరగబోయే పీఎస్ఎల్లో నా ఫిట్ నెస్ను నిరూపించుకుంటా'అని మిస్బా తెలిపాడు.

మరొకవైపు పాక్ వన్డే సారథిని మార్చేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సమాయత్తమవుతోంది. ఆసీస్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవానికి కెప్టెన్ అలీని బాధ్యున్ని చేస్తూ దిద్దుబాటు చర్యలను చేపట్టేందుకు పీసీబీ  సిద్ధమవుతోంది.  దీనిలో భాగంగా ఇప్పటికే లాహోర్లో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ వుల్ హక్, ప్రధాన కోచ్ ముస్తాక్ అహ్మద్ల భేటీ అయ్యారు.

ఈ భేటీలో అజహర్ అలీని తప్పించడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరొ క్రికెటర్ సర్పరాజ్ అహ్మద్కు వన్డే పగ్గాలు అప్పజెప్పేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ట్వంటీ 20 కెప్టెన్గా ఉన్న సర్పరాజ్ను వన్డే కెప్టెన్గా చేయాలనేది పీసీబీ పెద్దల భావనగా ఉంది. మూడు ఫార్మాట్ల క్రికెట్కు ఒక కెప్టెన్నే నియమిస్తే ఆశించిన ఫలితాలు సాధించడానికి దోహదం చేస్తుందని వారు యోచిస్తున్నారు. టెస్టు కెప్టెన్ గా మిస్బావుల్ హక్ ఉన్న నేపథ్యంలో అతన్ని కూడా తొలగించి మొత్తం జట్టు పగ్గాలను సర్ఫరాజ్ను అప్పగించాలనేది పాక్ పెద్దల భావన.

మరిన్ని వార్తలు