వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకునే..

4 Feb, 2017 13:15 IST|Sakshi
వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకునే..

కరాచీ:మరో రెండేళ్లలో జరిగే వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని తమ జట్టును బలోపతం చేయడానికి కృషి చేస్తున్నట్లు పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ వుల్ హక్ స్పష్టం చేశాడు. దీనిలో భాగంగా ఇప్పట్నుంచి జట్టులో పలు మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథులపై చర్చ జరుగుతుందనే విషయాన్ని ఇంజమామ్ తెలిపాడు. 'ప్రస్తుతం మా మదిలో 2019 వరల్డ్ కప్ మాత్రమే ఉంది. ఆ సమయానికి ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎంతమంది ఉంటారు అనేది చూడాలి. మా జట్టులో ప్రతీ ఒక్కరి తాజా ప్రదర్శన చూస్తే చాలా పేలవంగాఉంది. మా సీనియర్ ఆటగాళ్లు కూడా పెద్దగా రాణించడం లేదు. అంటే ఇప్పటికిప్పుడు మార్పులు వస్తాయని నేను చెప్పడం లేదు. కానీ వచ్చే వరల్డ్ కప్ నాటికి జట్టు కూర్పు ఎలా ఉండాలి అనే దానిపై కసరత్తు చేయడానికి సిద్ధమయ్యాం. ఇక ఆ పనిలోనే ఉండబోతున్నం'అని ఇంజమామ్ తెలిపాడు.

ఇదిలా ఉంచితే, టెస్టు కెప్టెన్సీ నుంచి మిస్బావుల్ హక్  వైదొలగడానికి విముఖత చూపిన విషయంపై ఇంజమామ్ స్పందించాడు.  అతను చాలా సుదీర్ఘమైన క్రికెట్ ఆడిన విషయం వాస్తవమే అయినప్పటికీ, ఏదొక సమయంలో జట్టు పగ్గాలను వదులుకోవాల్సిందనే విషయాన్ని గమనించాలన్నాడు. తమ జట్టుకు అతనొక సీనియర్ ఆటగాడిగా ఎన్నో సేవల్ని అందించి  తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విషయాన్ని ఇంజమామ్ తెలిపాడు. కాకపోతే ఇక్కడ జట్టు ప్రయోజనాలే ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలన్నాడు.

మరిన్ని వార్తలు