యాడ్‌లపై మహిళా క్రికెటర్‌ ఆగ్రహం

27 Apr, 2018 14:33 IST|Sakshi
సనా మిర్‌ (పాత చిత్రం)

ఇస్లామాబాద్‌ :  తెల్లగా ఉంటేనే అమ్మాయిలను చూస్తారని, అందంగా ఉండి... మంచి శరీరాకృతి ఉంటేనే అవకాశాలు వస్తాయంటూ... నిత్యం టీవీల్లో వచ్చే ప్రకటనలను చూస్తూంటాం. వాటి మాయలో పడి ఎత్తు పెరగడానికి, తెల్లగా మారడానికి శస్త్ర చికిత్సలు చేయించుకుని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు లేకపోలేదు. అయితే మహిళలకు కావాల్సింది ఆత్మవిశ్వాసమే తప్ప.. తక్కువ చేసి చూపించే బ్యూటీ ఉత్పత్తుల కాదంటున్నారు పాక్‌ క్రికెటర్‌ సనా మిర్‌. బ్యూటీ ఉత్పత్తుల యాడ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో ఆమె ఓ పోస్టును ఉంచారు.

తాజాగా నటి మహీరా ఖాన్‌ ఓ హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్‌ యాడ్‌లో నటించింది. అయితే ఆ యాడ్‌ అవమానకరంగా ఉందంటూ మిర్‌ తన ఫేస్‌బుక్‌లో ఓ సందేశం ఉంచారు. ‘మేము ఎప్పుడు వివిధ రంగాల్లో మహిళలకు ఎదురయ్యే ఆటంకాల గురించే మాట్లాడుకుంటాము. ఇలాంటి వ్యవహారాలు(యాడ్‌) మాకు చాలా ఆగ్రహం తెప్పించే అంశం. ఆడపిల్లలు ఆటలు ఆడాలంటే వారికి క్రీడల పట్ల అభిమానం, ప్రతిభ, నైపుణ్యం ఉంటే సరిపోదా? శరీరాకృతి, రంగే ప్రధానమా? నేను ఆడపిల్లలకు చెప్తున్నది ఒకటే మీరు క్రీడల్లో రాణించాలంటే మీకు ఉండాల్సింది సున్నితమైన చేతులు కాదు.. బలమైన చేతులు. ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. చాలామంది మహిళా క్రీడాకారులు వారి నైపుణ్య, కఠోర శ్రమ, ప్రతిభ వల్ల ఉన్నతంగా ఎదిగారు. అంతేతప్ప వారి శరీరాకృతి, రంగు వల్ల కాదు..

..నా ఈ 12 ఏళ్ల క్రీడా ప్రయాణంలో చాలా సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయమని నన్ను సంప్రదించాయి. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే క్రీడల్లో రాణించాలనుకునే వారికి సౌందర్య సాధనాలతో పనిలేదన్నది నా అభిప్రాయం. నేను సెలబ్రిటీలను, స్పాన్సర్లను కోరుకునేది ఒక్కటే.. యువతులు వారి కలలను పూర్తి చేసుకోవడానికి కావల్సిన నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని అందించి వారి కాళ్ల మీద వారు నిలిచేలా సహకరించండి. అంతే తప్ప రంగు, శరీరాకృతి గురించి ప్రచారం చేసి వారిని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి’ అంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ ఉంచారు. సనా పాకిస్తాన్‌ జాతీయ మహిళ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాక అంతర్జాతీయ మ్యాచ్‌లలో 190 వీకెట్లు తీశారు. 


 

మరిన్ని వార్తలు