స్పాట్‌ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిన క్రికెటర్‌

30 Aug, 2017 14:45 IST|Sakshi
స్పాట్‌ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిన క్రికెటర్‌

సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ ఆటగాళ్లు ఫిక్సింగ్‌లో కూరుకుపోయారు. స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురౌతున్నా ఆటగాళ్లు మాత్రం ఫిక్సింగ్‌లో దొరకుతూనే ఉన్నారు. సరిగ్గా మూడు నెలలక్రితం పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌లో స్పాట​ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాక్ ఆల్‌రౌండర్‌ నవాజ్‌పై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు రెండు నెలలపాటు నిషేధం విధించిన సంఘటన మరవక ముందే మరొక ఆటగాడు ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయాడు.

తాజాగా బుధవారం పాక్‌ ఓపెనర్‌ బ్యాట్‌మెన్‌ సార్జీల్‌ఖాన్‌పై పాకిస్తాన్‌ అవినీతి నిరోధక ట్రిబ్యునల్‌ 5ఏళ్లపాటు నిషేధం విధించింది.  మంగళవారం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు గత ఫిబ్రవరిలో దుబాయిలో నిర్వహించిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని సాక్ష్యాధారాలు సమర్పించడంతో  ట్రిబ్యునల్‌ తుది తీర్పును వెలువరించింది. సార్జీల్‌ఖాన్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పతున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ప్రారంభమైన రెండో రోజునే లీగ్‌ నుంచి వెనక్కి పంపించారు.

స్పాట్‌ ఫిక్సింగ్‌లో దొరకడం పాక్‌ క్రికెటర్లకు కొత్తేం కాదు. గతంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌భట్‌, పేసర్‌ మహమ్మద్‌ అమీర్‌, ఆసిఫ్‌లు 2010  ఇంగ్లండ్‌ పర్యటనలో స్పాట్‌ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయారు. 2012-13లో టెస్ట్‌ లెగ్‌ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా సైతం ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ప్రారంభం అనంతరం ఈ ఫిక్సింగ్‌ భూతం మరింత విస్తరించింది. స్పాట్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఆల్‌రౌండర్‌ మహ్మద్ నవాజ్‌పై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) మూడు నెలల క్రితం వేటు వేసింది. ఫిక్సింగ్‌ ఆరోపణలతో జంషెద్‌ అనే క్రికెటర్‌ కూడా గత ఫిబ్రవరిలో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.

మరిన్ని వార్తలు