అశ్విన్‌, జాదవ్‌లపై నిషేదం విధించండి?

17 Nov, 2017 19:40 IST|Sakshi

హఫీజ్‌ నిషేధంపై పాక్‌ అభిమానుల ఆగ్రహాం

సాక్షి, హైదరాబాద్‌: భారత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, కేదార్‌ జాదవ్‌, హర్భజన్‌ సింగ్‌ల బౌలింగ్‌పై నిషేదం విధించాలని పాకిస్థాన్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఐసీసీని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి కారణం పాక్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ అనుమానస్పద బౌలింగ్‌పై మరోసారి నిషేదం విధించడమే. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేయడానికి అతడిని గురువారం ఐసీసీ అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇటీవల అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. హఫీజ్‌ బంతులను వేసే సమయంలో తన మోచేతిని నిబంధనలు విరుద్దంగా వంచుతున్నాడని ఐసీసీ పేర్కొంది. ఇలా హఫీజ్‌ ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌పై నిషేధం విధించడం ఇది మూడోసారి. 2014 డిసెంబర్‌లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్‌ తర్వాత 2015 జూన్‌లో వివాదాస్పద బౌలింగ్‌ యాక్షన్‌తో నిషేధం కారణంగా 12 నెలల పాటు బౌలింగ్‌ చేయలేదు.

ఈ వార్త విన్న హఫీజ్‌ ట్విట్టర్‌ వేదికగా తన బాధను వ్యక్త పరిచాడు. ‘తన బౌలింగ్‌ శైలిని పూర్తిగా మార్చుకున్న తర్వాత కూడా ఐసీసీ నిషేదించడం బాధగా ఉంది. ఇది నన్ను ఎప్పటికి వెనుకడుగేయనివ్వదు. దేశం కోసం ఆడటానికి రెండు సార్లు ఎంతో కష్టపడి నా శైలిని మార్చుకున్నాను.ఇలానే మరింత కష్టపడి దేశం కోసం ఆడుతా’అని ట్వీట్‌ చేశాడు. ఇక పాక్‌ అభిమానులు హఫీజ్‌ను ప్రశంసిస్తూ త్వరలో ఐసీసీ నుంచి క్లీన్‌చీట్‌ అందుతోందని ఈ ఆల్‌రౌండర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మరి కొందరు భారత బౌలర్ల యాక‌్షన్‌ కూడా నిబద్దనలకు విరుద్దంగా ఉందని వారిపై కూడా నిషేదం విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేగాకుండా జాదవ్‌, అశ్విన్‌, హర్భజన్‌ బౌలింగ్‌ యాక‌్షన్‌ చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఐసీసీని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు