ఐసీసీ వద్ద పాకిస్తాన్ వరల్డ్ టీ 20 చర్చ!

9 Feb, 2016 17:35 IST|Sakshi
ఐసీసీ వద్ద పాకిస్తాన్ వరల్డ్ టీ 20 చర్చ!

కరాచీ: త్వరలో భారత్ లో జరుగనున్న వరల్డ్ టీ 20 టోర్నీలో పాల్గొనడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టు సంశయం వ్యక్తం చేస్తోంది. తమ జట్టు భారత్ లో పర్యటిస్తే దాడులకు గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్న పీసీబీ.. అదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి తీసుకెళ్లింది. తమ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశాలు తక్కువగా ఉందనే విషయాన్ని  పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ముందుగానే ఐసీసీ వద్దకు తీసుకెళ్లారు. గతంలో పాకిస్తాన్, భారత క్రికెట్ పెద్దల చర్చల సందర్భంగా ముంబైలో జరిగిన దాడుల విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తమ క్రికెట్ జట్టు భద్రత దృష్ట్యా ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ తాము ఆడే మ్యాచ్ లను తటస్థ వేదికలపై నిర్వహిస్తే ఆడే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇది కూడా తమ ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టే ఆధారపడి ఉంటుందని షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు.


గతేడాది డిసెంబర్ లో ఇరు జట్ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ రద్దయిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పలు చర్చల అనంతరం ఆ సిరీస్ కు ముగింపు పలికాయి. తటస్థ వేదికపై ఆడదామన్న భారత క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన పాకిస్తాన్.. ఆ సిరీస్ ను తమ దేశంలోనే ఆడాలని స్పష్టం చేసింది. కానిపక్షంలో భారత్ లో జరిగే వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్పట్లోనే హెచ్చరించింది. మరోవైపు తమతో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలనే ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని, దీనివల్ల తమకు కోట్లాది రూపాయల నష్టం వచ్చిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు పీసీబీ  తెలిపింది. భారత్‌లో ఐసీసీ ఈవెంట్లలో ఆడేందుకు పాక్ జట్లకు అనుమతి ఇస్తున్నప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లు ఎందుకు ఆడకూడదని షహర్యార్ ఖాన్  ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాల్గొనడంపై అనేక సందేహాలు వ్యక్తం మవుతున్నాయి.

మరిన్ని వార్తలు