అశ్విన్తో పోటీకి సిద్ధం: పాక్ బౌలర్

17 Oct, 2016 11:35 IST|Sakshi
అశ్విన్తో పోటీకి సిద్ధం: పాక్ బౌలర్

దుబాయ్:భారత క్రికెట్ జట్టులో రవి చంద్రన్ అశ్విన్ కీలక బౌలర్. ఇటీవలే అత్యంత వేగంగా టెస్టుల్లో 200 వికెట్లను సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్ ఘనతను సొంతం చేసుకున్నాడు. మరోవైపు పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా కూడా టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్లను సాధించిన రెండో బౌలర్గా నిలిచాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో యాసిర్ ఆ ఘనతను అందుకున్నాడు.

అయితే తన వికెట్ల వేటకు అశ్వినే ప్రధాన స్ఫూర్తి అంటున్నాడు యాసిర్ షా. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా రెండొందల వికెట్లను సాధించిన అశ్విన్ తనకు స్పూర్తిదాయకమైన సందేశాన్ని పంపాడన్నాడు.  వెస్టిండీస్ తో తొలి టెస్టుకు ముందు తాను సాధించాల్సిన రికార్డు కాస్త ఆలస్యమైందని, తదుపరి మ్యాచ్ ల్లో ఆ ఘనత సాధించాలని కోరుతూ అశ్విన్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేశాడని యాసిర్ షా పేర్కొన్నాడు.ఇదే తన ఉత్తమ ప్రదర్శనకు పరోక్షంగా దోహద పడిందన్నాడు.


కాగా, అశ్విన్ తో  పోటీకి సిద్ధమంటున్నాడు యాసిర్ షా.  తమ మధ్య మ్యాచ్లు జరగాలని ఇరు దేశాల్లోని ప్రతీ క్రికెటర్ కోరుకుంటాడని, అదే తరహాలో తాను కూడా భారత్ తో మ్యాచ్ ను ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఇదే క్రమంలో అశ్విన్ తో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు యాసిర్ ట్వీట్ చేశాడు. ఇప్పటివరకూ భారత్ తో తాను టెస్టు మ్యాచ్ ఆడలేదని, తమ పొరుగు దేశంతో క్రికెట్ ఆడటానికి అమితమైన ఆసక్తికనబరుస్తున్నానని పేర్కొన్నాడు.యాసిర్ తన టెస్టు కెరీర్ లో 17 వ టెస్టులో 100 వికెట్లను సాధించగా.. అశ్విన్ 37 టెస్టుల్లో 200 వికెట్ల మార్కును చేరాడు.

>
మరిన్ని వార్తలు