ఇక టెస్టులు ఆడటం నాకు సవాలే

4 Jun, 2020 06:40 IST|Sakshi

భారత యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా

న్యూఢిల్లీ: వెన్ను నొప్పికి శస్త్రచికిత్స తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడటం తనకు సవాలేనని భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టుకు తన అవసరమున్నందున సుదీర్ఘ ఫార్మాట్‌ కోసం తాపత్రయపడి ప్రమాదం కొనితెచ్చుకోనని పేర్కొన్నాడు. ‘టెస్టుల్లో నన్ను బ్యాకప్‌ సీమర్‌గా భావిస్తారని తెలుసు. కానీ వెన్నునొప్పి చికిత్స తర్వాత టెస్టులాడటం నాకు పెద్ద సవాలే. కేవలం నేను టెస్టు స్పెషలిస్టునే అయితే రిస్క్‌ చేసి అయినా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడేవాడిని. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టుకు నా అవసరం ఉంది’ అని పాండ్యా వెల్లడించాడు. 2018 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్‌ తీవ్రమైన వెన్నునొప్పితో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో ఇక తన కెరీర్‌ ముగిసిపోయినట్లు భావించానని అతను తెలిపాడు. ఇ

ప్పటివరకు 11 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 26 ఏళ్ల పాండ్యా 2018 సెప్టెంబర్‌ తర్వాత మరో టెస్టు ఆడలేదు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షో తర్వాత ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానన్న పాండ్యా... తన కారణంగా కుటుంబానికి చెడ్డ పేరు రావడం బాధించిందని అన్నాడు. కఠిన సమయాల్లో ముంబై ఇండియన్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తనను తండ్రిలా ఆదరించాడని తెలిపాడు. అతని నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నాడు. ఇతరుల అభిప్రాయాలు వినడంతోనే 2016 ఐపీఎల్‌ సీజన్‌లో రాణించలేకపోయానని పేర్కొన్నాడు. జాతీయ జట్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి, ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనకు ఎంతో మద్దతుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపాడు.
 

మరిన్ని వార్తలు