ధావన్‌కు గాయం: ఫ్లైట్‌ ఎక్కనున్న పంత్‌?

11 Jun, 2019 18:43 IST|Sakshi

లండన్‌: ప్రపంచకప్‌లో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టి భీకర ఫామ్‌లోకి వచ్చిన శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదివారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కౌల్టర్‌ నైల్‌ వేసిన ఓవర్లో ధావన్ ఎడమచేతి బొటన వేలికి బంతి బలంగా తాకడంతో గాయమైంది. నొప్పిను భరిస్తూనే సెంచరీ సాధించిన ధావన్ జట్టు భారీస్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. వేలి నొప్పితో ధావన్ ఫీల్డింగ్‌కు రాకుండా పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు. ధావన్ వేలికి స్కానింగ్ తీసిన డాక్టర్లు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
అయితే డాక్టర్ల సూచనల మేరకు జూన్ నెల మొత్తం ధావన్ విశ్రాంతి తీసుకోనున్నాడు. అందువల్ల లీగ్‌‌లో మిగతా జట్లతో జరిగే మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. భారత్‌ సెమీస్‌కు చేరితే మాత్రం ధావన్ తిరిగి బ్యాట్ పట్టే అవకాశముంది. అయితే ధావన్‌ను ప్రపంచకప్‌లో కొనసాగిస్తూనే ఓపెనర్‌గా రాహుల్‌ను పంపించాలని మెనేజ్‌మెంట్‌ భావిస్తోంది. దీంతో రాహుల్‌ ఓపెనింగ్‌కు వస్తే మిడిలార్డర్‌లో కార్తీక్‌, విజయ్‌శంకర్‌లతో నెట్టుకరావాలని తొలుత భావించింది. అయితే కీలక ప్రపంచకప్‌ నేపథ్యంలో రిస్క్‌ చేయకూడదనే ఉద్దేశంలో ఉన్న మేనేజ్‌మెంట్‌ రిషభ్‌ పంత్‌ను ఇంగ్లండ్‌కు రప్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీనియర్‌ ప్లేయర్‌ అంబటి రాయుడు ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా పంత్‌ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
(చదవండి: కోహ్లిసేనకు ఎదురు దెబ్బ)

కివీస్‌తో మ్యాచ్‌కు డౌటే..
అయితే రిషభ్‌ పంత్‌ అత్యవసరంగా ఇంగ్లండ్‌కు బయల్దేరిన గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఆదివారం జరగబోయే పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు పంత్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ధావన్‌ గాయంపై, పంత్‌ రాకపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే ధావన్‌ గాయం, విశ్రాంతిపై స్పష్టత వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు