రిషభ్‌ పరిస్థితి ఏమిటి?

18 Jan, 2020 10:31 IST|Sakshi

రాజ్‌కోట్‌:  ఎంకి పెళ్లి.. సుబ్బిచావుకి వచ్చినట్లు తయారైంది టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ పరిస్థితి. గాయం కారణంగా రిషభ్‌ దూరమైతే, ఇప్పుడు అది అతని కెరీర్‌కే ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉంది. రిషభ్‌ పంత్‌ స్థానంలో కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్‌ ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో రిషభ్‌ గాయపడటంతో అతని స్థానంలో రాహుల్‌ కీపింగ్‌కు దిగాడు. ఇక రెండో వన్డేలో సైతం రాహులే కీపింగ్‌ చేశాడు. రిషభ్‌ పంత్‌ ఎన్‌సీఏ పునరావాస శిబిరంలో చికిత్స తీసుకుంటున్న క్రమంలో రాహుల్‌కు కీపింగ్‌ బాధ్యతలు తప్పలేదు. అసలు ఆసీస్‌తో సిరీస్‌కు ముందే పంత్‌ను తొలగించి ముగ్గురు ఓపెనర్లు దిగితే బాగుంటుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌ యోచించింది. దాంతో రాహుల్‌ను అటు కీపర్‌గానూ వాడుకోవచ్చని భావించింది. చివరకు అదే జరిగింది. (ఇక్కడ చదవండి: కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత)

కాగా, ఇప్పుడు రాహుల్‌ కీపింగ్‌లో బ్యాటింగ్‌లో సత్తాచాటడంతో పంత్‌ పరిస్థితి ఏమిటి అంటూ నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. సోషల్‌ మీడియాలో రకరకాలు మీమ్స్‌ పోస్ట్‌ చేసి పంత్‌ను ఆడేసుకుంటున్నారు. రెండు వన్డేల్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌ దిగి రాణించిన రాహుల్‌.. కీపింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ను స్టంపౌట్‌ చేయడంతో పాటు డీఆర్‌ఎస్‌లో కూడా కచ్చితమైన అభిప్రాయాన్ని చెబుతూ ఉండటంతో రాహుల్‌ కీపర్‌గా ఫిట్‌.. పంత్‌ ఔట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మూడో వన్డేలో కూడా రాహుల్‌ రాణిస్తే పంత్‌ మరోసారి అయోమయానికి గురి కాకతప్పదు. ఇప్పటికే పేలవమైన ఫామ్‌తో సతమవుతున్న పంత్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అతన్ని కొంత కాలం పాటు పక్కన పెట్టి రాహుల్‌నే కీపర్‌గా కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

మరిన్ని వార్తలు