దివ్యాంగ అథ్లెట్లను ప్రోత్సహించాలి

17 Nov, 2019 10:22 IST|Sakshi

 పారా స్పోర్ట్స్‌ అకాడమీ, ప్రారంభోత్సవంలో సీఎస్‌ ఎస్‌కే జోషి

బొల్లారం: దివ్యాంగ అథ్లెట్లు క్రీడల్లో రాణించేందుకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (సీఎస్‌) ఎస్‌కే జోషి అన్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పారా అథ్లెట్ల కోసం రసూల్‌పురాలోని మెహతా అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్‌ ఆకాడమీ, రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ పారా అథ్లెట్ల కోసం అత్యాధునిక పునరావాస, శిక్షణ కేంద్రాన్ని మెహతా ఫౌండేషన్‌ వారు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పారా అథ్లెట్‌లకు సహకరించా లని కోరారు. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్థలం ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.  

అనంతరం సినీ నటి మంచు లక్ష్మి మాట్లా డుతూ అంగవైకల్యం ఉన్న వారి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ దిశగా ప్రయత్నం చేస్తున్న మెహతా ఫౌండేషన్‌ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వికలాంగులకు క్రీడల్లో మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతోనే దీన్ని ఏర్పాటు చేశామని ఫౌండేషన్‌ ప్రతినిధి ఆదిత్య మెహతా అన్నారు. పారా సైక్లింగ్, టెన్నిస్, టేబుల్‌ టెన్నిస్, వాలీబాల్, స్విమ్మింగ్, ఆర్చరీ, షూటింగ్, స్కేటింగ్, పవర్‌ లిఫ్టింగ్, రోయింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్‌ విభాగాల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు కె.కె శర్మ, ఆదిత్య మిశ్రా, అంజనీ సిన్హా, దినకర్‌ బాబు, ఎమ్‌.ఆర్‌ నాయక్, తరుషి, దుర్గాప్రసాద్, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు