‘అతను మరో ధోని కావడం ఖాయం’

30 May, 2020 10:48 IST|Sakshi

రాబిన్‌ ఊతప్ప నోట అస్సాం కుర్రాడి పేరు

త్వరలోనే టీమిండియాలో అరంగేట్రం చేస్తాడు..

న్యూఢిల్లీ: ఏడాది కాలంగా భారత క్రికెట్‌ జట్టుకు దూరమైన మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రీఎంట్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ధోని ఇప్పటి వరకూ తిరిగి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడలేదు కదా.. కనీసం దేశవాళీ మ్యాచ్‌లో కూడా పాల్గొనలేదు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఆడటానికి ధోని ముందుగానే సిద్ధమైనా అది జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. అన్ని అనుకూలిస్తే టీ20 వరల్డ్‌కప్‌లో ధోని కనిపించవచ్చు. అయితే ఒక గొప్ప మ్యాచ్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తే అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది. ధోని స్థానాన్ని రిషభ్‌ పంత్‌ భర్తీ చేస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ అది ఇప్పట్లో మనం చూసేలా కనబడుటం లేదు. కాగా, భారత క్రికెట్‌ జట్టు ఒక గొప్ప ఫినిషర్‌ను చూడబోతుందని వెటరన్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప జోస్యం చెప్పాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న లెగ్‌ స్పిన్నర్‌, అస్సాం క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌లో ధోని తరహా లక్షణాలు ఉన్నాయన్నాడు. (‘నేను టాస్‌ ఓడిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది’ )

బ్యాటింగ్‌ పరంగా గొప్ప మ్యాచ్‌ ఫినిషింగ్‌ లక్షణాలు పరాగ్‌లో ఉన్నాయన్నాడు. తాజాగా క్రిక్‌ఫిట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రాబిన్‌ ఊతప్ప పలు విషయాలను షేర్‌ చేసుకున్నాడు. అందులో ధోని తర్వాత మ్యాచ్‌ ఫినిషర్‌ పాత్ర ఎవరు పోషించబోతున్నారనే దానికి ఊతప్ప సమాధానం చెప్పాడు. ‘ ధోనికి స్థానానికి రియాన్‌ పరాగ్‌ సమాధానం అవుతాడు. ప్రస్తుతం పరాగ్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. నెక్స్ట్‌ ఎంఎస్‌ ధోని అతడే. త్వరలోనే 18 ఏళ్ల రియాన్‌ పరాగ్‌ భారత జట్టులో అరంగేట్రం చేయడం ఖాయం. నా ప్రకారం చూస్తే అతను భారత క్రికెట్‌ జట్టుకు సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహిస్తాడు. అతనిలో గొప్ప ఫినిషింగ్‌ లక్షణాలున్నాయి’అని ఊతప్ప తెలిపాడు. 2019 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరుఫున ఈ లీగ్‌లో పరాగ్‌ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఊతప్పను రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. (క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా