పర్దీప్ నర్వాల్ 'ట్రిపుల్ సెంచరీ'

24 Oct, 2017 13:45 IST|Sakshi

ముంబై:ప్రొ కబడ్డీ సీజన్-5 సీజన్ లో పట్నా పైరేట్స్ ఆటగాడు పర్దీప్ నర్వాల్ దుమ్మురేపుతున్నాడు.  ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారిన దుబ్కీ కింగ్ పర్దీప్  తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. మంగళవారం రాత్రి హరియాణా స్టీలర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్కడే 34 పాయింట్లతో సత్తా చాటాడు. తద్వారా ప్రొ కబడ్డీ చరిత్రలో అత్యధిక పాయింట్లను సాధించిన రైడర్ గా పర్దీప్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే సీజన్ -5లో 300 రైడ్ పాయింట్లతో అత్యధిక రైడ్ పాయింట్లను సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.

ఇదిలా ఉంచితే, హరియాణా స్టీలర్స్ ను ఆలౌట్ చేసిన క్రమంలో తొమ్మిది పాయింట్లను సాధించడం మరో విశేషం. ఆట 33వ నిమిషంలో రైడ్ కు వెళ్లిన పర్దీప్ ఒకేసారి ఆరుగురి ఆటగాళ్లను అవుట్ చేశాడు. అదే సమయంలో ఒక బోనస్ ను కూడా సాధించాడు. దాంతో మొత్తం తొమ్మిది పాయింట్లను ఒక రైడ్ ద్వారా సాధించినట్లయ్యింది. రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పట్నా 69–30 స్కోరుతో హరియాణా స్టీలర్స్‌పై జయభేరి మోగించింది. పర్దీప్ జోరుకు ప్రత్యర్థి జట్టు ఏకంగా ఐదు సార్లు ఆలౌటై భారీ ఓటమిని మూట గట్టుకుంది.

మరిన్ని వార్తలు