ఊహించని ఛాన్స్‌.. నిరీక్షణకు బ్రేక్‌!

12 Dec, 2016 15:00 IST|Sakshi
ఊహించని ఛాన్స్‌.. నిరీక్షణకు బ్రేక్‌!

మొహాలి: ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర పడింది. ఊహించని విధంగా అవకాశం తలుపు తట్టింది. వృద్ధిమాన్‌ సాహా గాయపడడంతో టీమిండియా టెస్టు టీమ్‌ లో పార్థివ్‌ పటేల్‌ కు ఛాన్స్‌ దక్కింది. ఎనిమిదేళ్ల తర్వాత అతడు టెస్టుల్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. పార్థివ్‌ చివరిసారిగా 2008 ఆగస్టులో శ్రీలంకతో కొలంబొలో జరిగిన టెస్టు మ్యాచ్‌ లో టీమిండియా తరపున ఆడాడు.

31 ఏళ్ల పార్థివ్‌ ఇప్పటివరకు 20 టెస్టులు ఆడి 29.69 సగటుతో 683 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. 17 ఏళ్ల వయసులో 2002లో ఇంగ్లండ్‌ తో జరిగిన మ్యాచ్‌ తో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. చిన్న వయసులోనే జాతీయ జట్టులో చోటు సంపాదించిన పార్థివ్‌ నిలదొక్కుకోలేకపోయాడు. అంచనాలకు తగినట్టు రాణించలేక స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. అతడి కంటే ఆలస్యంగా టీమిండియాలో స్థానం దక్కించుకున్న ఎంఎస్‌ ధోని జట్టులో పాతుకుపోవడంతో పార్థివ్‌ కు అవకాశం లేకుండా పోయింది. ధోని జట్టుకు దూరమైనప్పుడు మాత్రమే అతడికి సెలెక్టర్ల నుంచి పిలుపువచ్చేంది. ఆరేళ్ల కాలంలో పటేల్‌ కేవలం 20 టెస్టు మ్యాచ్‌ లు మాత్రమే ఆడాడు.

2014లో టెస్టుల నుంచి ధోని రిటైరయ్యాక యువ ఆటగాళ్లకు అవకాశం దక్కడంతో పార్థివ్‌ దేశవాళి మ్యాచ్‌ లకే పరిమితమయ్యాడు. రంజీ మ్యాచుల్లో రాణిస్తున్నా సెలెక్టర్లు అతడిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ అందుబాటులో లేకపోవడం వల్లే అతడికి అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌ తో జరిగే మూడో టెస్టులో పార్థివ్‌ రాణించినా అతడి అంతర్జాతీయ కెరీర్‌ కు పెద్దగా ఉపయోగపడకపోవచ్చని విశ్లేషకుల అంచనా.

మరిన్ని వార్తలు