గంటా 53 నిమిషాలు...

23 Apr, 2015 01:20 IST|Sakshi
గంటా 53 నిమిషాలు...

హోరాహోరీ పోరులో జెన్‌పై కశ్యప్ విజయం
 ఆసియా బ్యాడ్మింటన్ ప్రిక్వార్టర్స్‌కు చేరిక
 సింధు కూడా ముందంజ

 
  మ్యాచ్ సుదీర్ఘంగా, కఠినంగా జరిగింది. నా ఆటతీరుపట్ల సంతృప్తితో ఉన్నాను. గతేడాది ‘ఏబీసీ’లో అతను నన్ను ఓడించాడు. అతనితో ఇం డియా ఓపెన్‌లో ఆడిన మ్యాచ్‌లోనూ గట్టిపోటీ ఎదురైంది. గురువారం మ్యాచ్ సమయానికి మళ్లీ తాజాగా బరిలోకి దిగుతానని ఆశిస్తున్నా.
 -కశ్యప్

 
 వుహాన్ (చైనా): భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నమ్మశక్యంకాని విధంగా గంటా 53 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ పోరులో కశ్యప్ 15-21, 21-18, 21-19తో తన ప్రత్యర్థి, ప్రపంచ 25వ ర్యాంకర్ జెన్ హావో సు (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఈ విజయంతో నిరుడు ఇదే టోర్నీలో జెన్ హావో సు చేతిలో ఎదురైన పరాజయానికి కశ్యప్ ప్రతీకారం తీర్చుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో కశ్యప్ ఆడతాడు.
 
  మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో సింధు 21-6, 21-5తో అనైత్ ఖుర్షుద్యాన్ (ఉజ్బెకిస్థాన్)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ విభాగం రెండో రౌండ్‌లో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా ద్వయం 15-21, 17-21తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావా (జపాన్) జోడీ చేతిలో ఓడిపోగా... సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంటకు ‘వాకోవర్’ లభించడంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
 
 జెన్ హావో సుతో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్‌కు ఆద్యంతం తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్ ఆరంభంలో 0-2తో వెనుకబడి ఆ తర్వాత స్కోరు సమం చేసిన కశ్యప్ అనంతరం పూర్తిగా లయ తప్పాడు. రెండో గేమ్ మొదట్లో 2-5తో వెనుకబడ్డ ఈ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ సహనం కోల్పోకుండా ఆడుతూ స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఆధిక్యం ఇద్దరి మధ్య దోబూచులాడుతున్న దశలో కశ్యప్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 15-12తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే ఆధిక్యాన్ని కాపాడుకొని గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు.
 
 నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ తొలుత 2-5తో, ఆ తర్వాత 4-7 తో వెనుకంజ వేశాడు. అయితే పట్టువదలకుండా పోరాడి తేరుకున్నాడు. కశ్యప్ 20- 19తో ఆధిక్యంలో ఉన్న దశలో విద్యుత్ అంతరాయంతో మ్యాచ్ 15 నిమిషాలపాటు నిలిచిపోయింది. కరెంటు వచ్చాక కశ్యప్ కీలకమైన పాయింట్ నెగ్గి విజయాన్ని దక్కించుకున్నాడు.
 
 అనధికార రికార్డుల ప్రకారం సుదీర్ఘ సమయం మ్యాచ్ ఆడిన  భారత ప్లేయర్‌గా కశ్యప్ గుర్తింపు పొందాడు. బ్యాడ్మింటన్‌లో సుదీర్ఘ మ్యాచ్ రికార్డు పీటర్ రస్‌ముస్సేన్ (డెన్మార్క్), సున్ జు (చైనా)ల పేరిట ఉంది. 1997 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో పీటర్ 2 గంటల 4 నిమిషాల్లో సున్ జును ఓడించి విజేత అయ్యాడు.
 

మరిన్ని వార్తలు