‘కోహ్లి సెంచరీ’ పై కమిన్స్‌ యూటర్న్‌!

20 Jul, 2018 08:50 IST|Sakshi
కమిన్స్‌, కోహ్లి (ఫైల్‌ ఫొటో)

సిడ్నీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేయలేడని ఆ దేశ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను మీడియా హైలైట్‌ చేయడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. జట్టు వ్యూహంలో భాగంగానే ఆసీస్‌ ఆటగాళ్లు మాటల దాడిని ప్రారంభించారని, సిరీస్‌ ముందే భారత కెప్టెన్‌ కోహ్లిని టార్గెట్‌ చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈ ఆసీస్‌ బౌలర్‌ ఈ కామెంట్స్‌పై యూటర్న్‌ తీసుకున్నాడు. కోహ్లిపై తను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం ఆశ్చర్యానికి గురి చేసిందని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) అధికారిక వెబ్‌సైట్‌కు తెలిపాడు. 

కోహ్లిని తక్కువ అంచనా వేయలేదని, ప్రశంసించానని ఈ ఆసీస్‌ ఆటగాడు మాటమార్చాడు. సెంచరీ చేయలేడంటే.. అతన్ని తాము అడ్డుకుంటామని, భారత జట్టులో అతను కీలక ఆటగాడు కాబట్టే అలా మాట్లాడనని చెప్పుకొచ్చాడు. అతన్ని పరుగులు చేయకుండా అడ్డుకుంటేనే తమకు విజయం దక్కుతుందన్నాడు. కోహ్లి మా జట్టుపై పరుగులు చేయకపోవడాన్నే ఇష్టపడతానని ఆ ఇంటర్వ్యూలో తెలిపానని, కానీ కోహ్లి సెంచరీ చేయలేడని అనలేదని కమిన్స్‌ స్పష్టం చేశాడు. కోహ్లినే కాదని ఏ అంతర్జాతీయ ఆటగాడైన తమ జట్టుపై పరుగులు చేయవద్దనే అనుకుంటానని తెలిపాడు. ఇక భారత అభిమానులు కోహ్లి నుంచి చాలా కోరుకుంటున్నారని, ఈ విషయాన్ని ట్విటర్‌లో పదేపదే ప్రస్తావిస్తున్నారని, ఇది అంత మంచిది కాదని కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లికి క్రికెట్‌ అంటే పిచ్చిఅని, అతనికి మరింత మోటివేషన్‌ అవసరం లేదన్నాడు. తమకు స్టీవ్‌ స్మిత్‌ ఎలాగో కోహ్లి కూడా అలాగేనని తెలిపాడు. 

ఇంగ్లండ్‌ పర్యటనంతరం భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ టూర్‌లో భారత్‌, ఆసీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనుంది.  సెప్టెంబర్‌ 21న తొలి టీ20 జరగనుంది.

చదవండి: కోహ్లికి మాతో అంత ఈజీ కాదు!

>
మరిన్ని వార్తలు