టైటాన్స్‌ తెలుగు నేలపై చేతులెత్తేసింది..!

27 Jul, 2019 05:09 IST|Sakshi

ఆడిన నాలుగూ ఓడిన వైనం

పట్నా పైరేట్స్‌ గెలుపు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు టైటాన్స్‌ తెలుగు నేలపై చేతులెత్తేసింది. సొంతప్రేక్షకులు  మద్దతిచ్చినా... అసలు బోణీనే కొట్టలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యింది. శుక్రవారం జరిగిన హైదరాబాద్‌ అంచె ఆఖరి పోరులో టైటాన్స్‌ 22–34 స్కోరుతో పట్నా పైరేట్స్‌ చేతిలో పరాజయం చవిచూసింది. కోటి ఆశల సిద్ధార్థ్‌ దేశాయ్‌ మళ్లీ నిరాశపరిచాడు. స్టార్‌ రైడర్‌గా బరిలోకి దిగిన దేశాయ్‌ 12 సార్లు రైడింగ్‌కు వెళ్లి కేవలం 5 పాయింట్లే తెచ్చాడు. ఒక టాకిల్‌ పాయింట్‌ సాధించాడు. డిఫెండర్లు అబొజర్‌ మిఘాని (2), విశాల్‌ భరద్వాజ్‌ (2)లు ప్రత్యర్థి రైడర్లను టాకిల్‌ చేయలేకపోయారు.

దీంతో తెలుగు జట్టు భారీ తేడాతో ఓడిపోయింది. మరోవైపు పట్నా జట్టులో స్టార్‌ ఆటగాళ్లయిన ప్రదీప్‌ నర్వాల్, జైదీప్‌లు ఆరంభం నుంచే పట్టుబిగించారు. రైడింగ్‌లో నర్వాల్‌ 7 పాయింట్లు సాధించగా, డిఫెం డర్‌ జైదీప్‌ (6) టైటాన్స్‌ రైడర్లను చక్కగా ఒడిసిపట్టాడు. మిగతా ఆటగాళ్లలో జంగ్‌ కున్‌ లీ (4), నీరజ్‌ కుమార్‌ (3) ఆకట్టుకున్నారు. మొహమ్మద్‌ ఎస్మెల్, హాది ఒస్తరక్‌ చెరో 2 పాయింట్లు చేశారు.  అంతకుముందు మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 44–19 స్కోరుతో యూపీ యోధపై ఘనవిజయం సాధించింది. గుజరాత్‌ తరఫున రైడింగ్‌లో రోహిత్‌ గులియా (10), డిఫెన్స్‌లో పర్వేశ్‌ బైస్వాల్‌ (6) రాణించారు. యూపీ జట్టులో రైడర్‌ శ్రీకాంత్‌ జాదవ్‌ (5) ఒక్కడే మెరుగనిపించాడు. నితీశ్‌ కుమార్, మోను గోయత్, ఆజాద్‌ రెండేసి పాయింట్లు చేశారు.  

అతిథిగా కోహ్లి
నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ పోటీలు ముంబైలో జరుగుతాయి. శనివారం ఇక్కడ జరిగే ఆరంభ వేడుకకు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అతిథిగా హాజరు కానున్నాడు.

నేటి మ్యాచ్‌లు
యు ముంబా X పుణేరి పల్టన్‌ రా.గం. 7.30 నుంచి
జైపూర్‌ X బెంగాల్‌ వారియర్స్‌ రా.గం. 8.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్షప్రసారం

మరిన్ని వార్తలు