దూషించి నిషేధానికి గురైన క్రికెటర్‌

17 Nov, 2019 11:25 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా క్రికెటర్‌ జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌పై నిషేధం పడింది. షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో భాగంగా విక్టోరియా తరఫున ఆడుతున్న ప్యాటిన్‌సన్‌.. ​క్వీన్‌లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోని ఆటగాడిపై వ్యక్తిగత దూషణలకు దిగాడు. అతనితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలాన్ని వాడాడు. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) సీరియస్‌ అయ్యింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా కోడ్‌ ఆఫ్‌ కండెక్ట్‌లో భాగంగా ఇ‍ప్పటికే రెండు డీమెరిట్‌ పాయింట్లు కల్గి ఉన్న ప్యాటిన్‌సన్‌.. మరోసారి దూకుడు ప్రదర్శించడంతో వేటు తప్పలేదు. ఫలితంగా పాకిస్తాన్‌తో గురువారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌లో ఉన్న ప్యాటిన్‌సన్‌పై నిషేధం విధిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఒక ఆటగాడ్ని దూషించిన కారణంగా ప్యాటిన్‌సన్‌పై ఒక టెస్టు నిషేధం విధిస్తున్నట్లు సీఏ పేర్కొంది.

తాను సహనం కోల్పోవడం వల్లే క్వీన్‌లాండ్స్‌ ఆటగాడ్ని దూషించినట్లు సీఏకు ఇచ్చిన ఓ ప్రకటనలో ప్యాటిన్‌సన్‌ పేర్కొన్నాడు. ఆ పరిస్థితుల్లో వాడివేడి వాతావరణం చోటు చేసుకోవడంతో తాను నోరు జారినట్లు ఒప్పుకున్నాడు. తన తప్పిదాన్ని ప్యాటిన్‌సన్‌ తనకు తానుగా ఒప‍్పకోవడంతో ఒక మ్యాచ్‌ నిషేధంతో సీఏ సరిపెట్టింది. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ప్యాటిన్‌సన్‌ సభ్యుడు. మిచెల్‌ స్టార్క్‌తో కలిసి బౌలింగ్‌ పంచుకోవాల్సిన తరుణంలో ఇలా నిషేధానికి గురి కావడం ఆసీస్‌కు ఎదురుదెబ్బే. ఇప్పటికే పలువురి క్రికెటర్లు మానసిక సమస్యలతో జట్టుకు దూరమయ్యారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు