విలియమ్సన్‌ ఏందీ తొండాట?

20 Jun, 2019 13:17 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ : కడవరకు నిలచి.. అద్భుత శతకంతో జట్టుకు విజయాన్నందించిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ పాల్‌ ఆడమ్స్‌ తప్పుబట్టాడు. బుధవారం సఫారీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్‌.. సఫారి ఆటగాళ్ల అలసత్వంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాహిర్‌ చివరి ఓవర్‌(38) ఆఖరి బంతి విలియమ్సన్‌ బ్యాట్‌ను అలా తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. తాహిర్‌ గట్టిగానే అప్పీల్‌ చేసినా ఏదో లోకంలో ఉన్నట్లు కనిపించిన కీపర్‌ డి కాక్‌ కనీసం స్పందించలేదు. దాంతో తాహిర్‌ నిరాశగా వెనుదిరిగాడు. తర్వాత రీప్లే చూస్తే విలియమ్సన్‌ ఔటయ్యేవాడని తేలింది. ఆ సమయానికి కివీస్‌ 67 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉంది. నిజంగా విలియమ్సన్‌ వికెట్‌ తీసి ఉంటే మ్యాచ్‌ సఫారీల చేతుల్లోకి వచ్చేసేదే. దక్షిణాఫ్రికా దురదృష్టం ఏమిటంటే ఆ జట్టుకు ఒక రివ్యూ కూడా మిగిలి ఉంది.

ఆటగాళ్లు అన్యమనస్కంగా ఉండి అప్పటికే చేతులెత్తేయడంతో ఇలాంటి మంచి అవకాశం వారికి చేజారింది. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విలియమ్సన్‌పై పాల్‌ ఆడమ్స్‌ మాటల దాడికి దిగారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అప్పీల్‌ చేయకుంటే.. విలియమ్స్‌కు ఏమైందని, అతను క్రీజును విడిచి వెళ్లవచ్చు కదా? ఎందుకు వెళ్లలేదంటూ ట్వీట్‌ చేశాడు. ఇదేనా విలియమ్సన్‌ క్రీడాస్పూర్తి? అని పరోక్షంగా ప్రశ్నించాడు. ఒకవేళ విలియమ్సన్‌ మన్కడింగ్‌ విధానంలో ఔటైతే.. క్రీజును వదిలిపెట్టి వెళ్లడని మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక అభిమానులు కూడా ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు విలియమ్సన్‌ది తొండాటని తప్పుబడుతుండగా.. మరికొందరు వెనకేసుకొస్తున్నారు. ఇక సఫారి సారథి డూప్లెసిస్‌ అయితే అది ఔటని మ్యాచ్‌ తర్వాత తెలిసిందన్నాడు. కానీ ఇదే మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపిందనడం సరికాదని అభిప్రాయపడ్డాడు.     
చదవండి : అయ్యో.. అది ఔటా?

మరిన్ని వార్తలు