‘ఆ ఇద్దరి వల్లే భారత్‌కు విజయాలు’

20 Feb, 2018 09:26 IST|Sakshi

దక్షిణాఫ్రికా మాజీ చైనామన్‌ బౌలర్‌ పాల్‌ ఆడమ్స్‌

సాక్షి, స్పోర్ట్స్‌ : భారత మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహలే భారత విజయాలకు కారణమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ పాల్‌ ఆడమ్స్‌ అభిప్రాయపడ్డారు.  ఈ ఇద్దరితోనే కోహ్లిసేన బలంగా ఉందని తెలిపారు.  బ్యాటింగ్‌కే ఎకువ ప్రాధాన్యత ఇచ్చే ప్రస్తుత తరుణంలో ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవడం గొప్ప విషయమన్నారు. వారు మణికట్టు బౌలర్లే అయినప్పటికి వారు వేసే బంతుల్లో చాలా వైవిధ్యం ఉందని కొనియాడారు.

బ్యాట్స్‌మన్‌కు అందకుండా బంతులు వేస్తూ సమర్ధవంతమైన ప్రదర్శనను కనబరుస్తున్నారని ఈ మాజీ క్రికెటర్‌ తెలిపారు. బ్యాటింగ్‌కు అనుకూలించే జోహన్నెస్‌బర్గ్‌ మైదానంలో ఆతిథ్య జట్టు ఒక్క స్పిన్నర్‌ను కూడా బరిలోకి దింపలేదన్నారు. కానీ భారత్‌ మాత్రం ఈ ఇద్దరిని ఆడించి ప్రత్యేకంగా నిలిచిందన్నారు.

దక్షిణాఫ్రికాలో తొలి సారి పర్యటిస్తున్నా ఆ యువస్పిన్నర్లలో ఏ మాత్రం భయం కనిపించలేదన్నారు. వారు ఒక మ్యాచ్‌లోనే ఒత్తిడికి లోనయ్యారని, తర్వాతీ మ్యాచుల్లో బ్యాటింగ్‌పిచ్‌లపై సైతం రాణించారని ఆడమ్స్‌ ప్రశంసించారు. చాహల్‌ స్థిరంగా రాణిస్తూ బంతిని చాలా బాగా తిప్పేస్తున్నాడని, యాదవ్‌ గూగ్లీలు బ్యాట్స్‌మన్‌కు ఏమాత్రం అర్థం కావడంలేదన్నారు. ఇక ఐపీఎల్‌తో వారు మరింత రాటుదేలుతారని చెప్పుకొచ్చారు.

సఫారీ పర్యటనలో భారత్‌ 5-1తో వన్డే సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించడంలో ఈ యువ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఆరు వన్డేల్లో ఏకంగా 33 వికెట్లు పడగొట్టారు. 

మరిన్ని వార్తలు