మళ్లీ ఓడిన సింధు

1 Feb, 2020 02:28 IST|Sakshi

హంటర్స్‌ ప్లేయర్‌పై తై జు యింగ్‌ గెలుపు

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: సొంత గడ్డపై హైదరాబాద్‌ హంటర్స్‌ ప్లేయర్‌ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. మహిళల సింగిల్స్‌లో సింధు 15–11, 13–15, 9–15తో తై జు యింగ్‌ (బెంగళూరు రాప్టర్స్‌) చేతిలో ఓడింది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) సీజన్‌–5లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 0–3తో బెంగళూరు రాప్టర్స్‌ చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో సత్తా చాటిన సింధు... తర్వాతి రెండు గేమ్‌ల్లో విఫలమై పరాజయం పాలైంది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్‌లో బెన్‌ లేన్‌–వ్లాదిమిర్‌ ఇవనోవ్‌ (హైదరాబాద్‌) ద్వయం 13–15, 15–9, 12–15తో పెంగ్‌ సూన్‌ చాన్‌–రియాన్‌ అగుంగ్‌ సపుర్తో (బెంగళూరు) జోడీ చేతిలో ఓడింది.

అనంతరం జరిగిన పురుషుల తొలి సింగిల్స్‌లో ‘ట్రంప్‌ కార్డు’తో ఆడిన హైదరాబాద్‌ ప్లేయర్‌ సౌరభ్‌ వర్మ 12–15, 15–10, 6–15తో బ్రైస్‌ లెవెర్డెజ్‌ (బెంగళూరు) చేతిలో ఓడాడు. పీబీఎల్‌ నిబంధనల ప్రకారం ‘ట్రంప్‌ కార్డు’ వాడిన ఆటగాడు ఓడితే... అతని జట్టుకు ఒక పాయింట్‌ను పెనాల్టీగా విధిస్తారు. దాంతో హైదరాబాద్‌ (–1)–2తో వెనుకబడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ‘ట్రంప్‌ కార్డు’తో బరిలో దిగిన పెంగ్‌ సూన్‌ చాన్‌–యోమ్‌ హే వోన్‌ (బెంగళూరు) జోడీ 13–15, 11–15తో వ్లాదిమిర్‌ ఇవనోవ్‌–సిక్కిరెడ్డి (హైదరాబాద్‌) ద్వయం చేతిలో ఓడింది. చివరగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో డారెన్‌ లియూ (హైదరాబాద్‌) 11–15, 6–15 తో సాయి ప్రణీత్‌ (బెంగళూరు)చేతిలో ఓడాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా