‘సర్ఫరాజ్‌.. ​జట్టును ముందుండి నడిపించు’

19 Jun, 2019 12:07 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి 

ఇస్లామాబాద్‌ : భారత్‌ చేతిలో ఎదురైన ఓటమిని మరిచిపోయి ప్రపంచకప్‌ టోర్నీలోని మిగతా మ్యాచ్‌లపై దృష్టి సారించాలని పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డ్‌ (పీసీబీ) చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి వెల్లడించినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. ‘దేశమంతా మీకు అండగా ఉంది. రాబోయే రోజుల్లో కలసికట్టుగా మెరుగైన ప్రదర్శనను ఇస్తారని ఆశిస్తున్నాం’ అని సర్ఫరాజ్‌ అహ్మద్‌తో ఎహ్‌సాన్‌ మణి ఫోన్‌లో మాట్టాడినట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తకథనాలను పట్టించుకోకుండా రానున్న మ్యాచ్‌ల్లో  కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించాలని చైర్మన్‌ ఎహ్సాన్‌ మణి సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కోరినట్లు న్యూస్‌ ఎక్స్‌ తన కథనంలో వివరించింది.

‘మిగిలిన మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే తన సహచరులతో కలిసి స్వదేశానికి వెళ్తే ఇబ్బందులు తప్పవని’ ఆదివారం మాంచెస్టర్‌ ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ మైదానంలో భారత్‌తో ముగిసిన మ్యాచ్‌ అనంతరం సర్ఫరాజ్‌ అహ్మద్‌  వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన పాక్‌ 3 పాయింట్లతో పట్టికలో 9వ స్ధానంలో నిలిచింది. తమ తర్వాతి మ్యాచ్‌లో భాగంగా ఈ నెల 23న లార్డ్స్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

మరిన్ని వార్తలు