ఉమర్ అక్మల్ దే తప్పు..!

28 Sep, 2017 14:40 IST|Sakshi

కరాచీ: గత నెల్లో పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్ తో జరిగిన వాగ్వాదంలో క్రికెటర్ ఉమర్ అక్మల్ దే తప్పుగా తేలింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఏర్పాటు చేసిన విచారణ కమిటీ అక్మల్ ను దోషిగా తేల్చింది. పీసీబీ కమిటీ తన విచారణలో భాగంగా ఉమర్ తో పాటు అక్కడ ఉన్న మిగతా సభ్యులతో కూడా సమావేశమై వారితో చర్చించింది. అనంతరం ఈ వ్యవహారంలో ఉమర్ దే తప్పుగా నిర్ధారించిన కమిటీ.. అతనిపై మూడు మ్యాచ్ లు నిషేధాన్ని విధించేందుకు పీసీబీకి సిఫారుసు చేసింది. మరొకవైపు కొంతకాలం విదేశీ లీగ్ లు ఆడేందుకు అతనికి అనుమతి ఇవ్వకూడదని హారూన్ రషీద్ నేతృత్వంలోని విచారణ కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనిపై పీసీబీ చైర్మన్ నజీమ్ సేథీ త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


గత నెల్లో లాహోర్ లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉమర్ అక్మల్-మికీ ఆర్థర్ ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఉమర్ నోరు జారాడు. కాగా, తనను కోచ్ దూషించాడంటూ అక్మల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. 'నాతో వాగ్వాదం సందర్భంగా ఆర్థర్ చాలా పేలవమైన భాష మాట్లాడాడు. అదే క్రమంలో దూషణలకు దిగాడు. మా క్రికెట్ పెద్దలు ఇంజమామ్, ముస్తాక్ లు సాక్షిగా నాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఫిట్ నెస్ శిక్షణకు హాజరైన క్రమంలో క్లబ్ క్రికెట్ ఆడుకో అని ఆర్తర్ సహనాన్ని కోల్పోయాడు. అదే క్రమంలో తీవ్రస్థాయిలో దూషణలకు దిగాడు' అని ఆ గొడవ అనంతరం ఉమర్ అక్మల్ ఆరోపణలు గుప్పించాడు.

మరిన్ని వార్తలు