ఐసీసీపై ఆగ్రహం.. క్రికెటర్‌​​‍కు నోటీసులు

19 May, 2018 19:38 IST|Sakshi
మహమ్మద్‌ హఫీజ్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిబంధనలపై ఆగ్రహం వ్యక్తంచేసినందుకుగానూ వివరణ ఇవ్వాల్సిందిగా శనివారం నోటీసులు జారీచేసింది. బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్‌.. ఐసీసీ బౌలింగ్‌ యాక్షన్‌ నిబంధనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. బౌలింగ్‌ యాక్షన్‌ వ్యవహారంలో ఐసీసీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఐసీసీతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న బోర్డు క్రికెటర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరి బౌలర్లకు ఒకే నిబంధనలను అమలు చేయాలని సూచించాడు. అనుమానస్పద బౌలింగ్‌ యాక్షన్‌ కలిగి ఉన్న బౌలర్లను పరీక్షించడానికి ఓ విధానాన్ని రూపోందించాలని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు ఐసీసీకి వ్యతిరేకంగా ఉండటంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వివరణ కోరింది. 

ఈ నోటీసుల వ్యవహారంపై హాఫిజ్‌ స్పందిస్తూ.. తాను పీసీబీ అనుమతితోనే ఇంటర్వూలో పాల్గొన్నానని తెలిపాడు. తాను గంటపాటు ఇంటర్వూ ఇస్తే అందులో కేవలం 15 సెకన్ల గురించి మాట్లాడుతున్నారని, మొత్తం ఇంటర్వ్యూ చూసి తను ఏ సందర్భంలో మాట్లాడానో తెలుసుకోవాలన్నాడు.

బౌలింగ్ వేసేటప్పుడు మోచేతిని 15 డిగ్రీల వరకు వంచేందుకు ఐసీసీ అనుమతిస్తుంది. ఈ విషయంలో మూడుసార్లు నిబంధనల కంటే ఎక్కువగా మోచేతిని వంచిన హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీ అనుమానం వ్యక్తం చేస్తూ నిషేధం విధించింది. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అనుమానాస్పద బౌలింగ్ కారణంగా ఐసీసీ అతడిని సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 17న లాబోరో యూనివర్సిటీలో జరిగిన పరీక్షల్లో హఫీజ్ ఐసీసీ అనుమతించిన 15 డిగ్రీల్లోపే మోచేతిని వంచుతున్నట్టు తేలింది. దీంతో మే 1న తిరిగి అతడిపై ఉన్న నిషేదాన్ని ఎత్తేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు