ఆడితే ఆడండి.. పోతే పొండి!

13 Sep, 2019 15:35 IST|Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌ పర్యటనకు తాము రాలేమంటూ 10 శ్రీలంక క్రికెటర్లు తేల్చి చెప్పిన నేపథ్యంలో తటస్థ వేదిక ప్రస్తావన వచ్చింది. పాకిస్తాన్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహిస్తే బాగుంటుందనే శ్రీలంక క్రికెట్‌ బోర్డు విన్నపాన్ని పీసీబీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్‌ను మార్చబోమని తెగేసి చెప్పింది. అసలు స్వదేశీ సిరీస్‌ను వేరే చోట(తటస్థ వేదికపై) నిర్వహించే ప్రశ్నే లేదని పీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి పాకిస్తాన్‌కు తీసుకురావాలని భావిస్తున్న తరుణంలో తటస్థ వేదికలో నిర్వహిస్తే ప్రయోజనం ఏముందని నిలదీశారు. ఒకవేళ శ్రీలంకతో సిరీస్‌ను తటస్థ వేదికపై నిర్వహించడానికి ముందడుగు వేస్తే మిగతా విదేశీ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు తీసుకు రావడం కష్టతరం అవుతుందన్నారు.

త్వరలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) ఆరంభం కానున్న వేళ.. ఒక ద్వైపాక్షిక సిరీస్‌కు తాము వేరే వేదికను కేటాయిస్తే దేశంలో భద్రతపై మరింత ఆందోళన వ్యక్తమవుతుందని సదరు అధికారి తెలిపారు. దాంతో ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం కచ్చితంగా శ్రీలంక క్రికెట్‌ జట్టు.. పాకిస్తాన్‌లో ఆడాల్సి ఉంటుందనే సంకేతాలిచ్చారు. పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను కరాచీ, లాహోర్‌లో ఆడాల్సి ఉంది. సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి అక్టోబర్‌9 తేదీ వరకూ ఇరు జట్ల మధ్య సిరీస్‌ జరగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా  శ్రీలంక సీనియర్‌ క్రికెటర్లు తాము పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లలేమని చెప్పడంతో ఆ సిరీస్‌ డైలమాలో పడింది.

>
మరిన్ని వార్తలు