టీమిండియాపై చర్యలు తీసుకోవాల్సిందే : పీసీబీ

11 Mar, 2019 09:43 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : బీసీసీఐ స్వార్థ రాజకీయాల కోసం క్రికెట్‌ను వాడుకుంటోందని ఆరోపిస్తూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ).. ఐసీసీకి లేఖ రాసింది. పుల్వామా ఉగ్రదాడి అమర జవాన్ల స్మారకార్థం టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మిలిటరీ క్యాపులు ధరించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... ‘ బీసీసీఐ.. ఐసీసీ దగ్గర అనుమతి తీసుకున్న ఉద్దేశానికి.. ఆచరణకు చాలా తేడా ఉంది. తన రాజకీయాల కోసం బీసీసీఐ క్రికెట్‌ను వాడుకుంటోంది. ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ విషయం గురించి మా లాయర్లతో చర్చించి ఐసీసీకి మరోసారి లేఖ రాయాలని నిర్ణయించుకున్నాం. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు’  అని పేర్కొన్నారు.

గతంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇమ్రాన్‌ తాహిర్‌, మొయిన్‌ అలీ మైదానంలో రాజకీయాల గురించి మాట్లాడరన్న మణి...‘ తాహిర్‌, అలీలపై తీసుకున్న చర్యలే టీమిండియా ఆటగాళ్లపై కూడా తీసుకోవాలని ఐసీసీని కోరుతున్నాం. క్రికెట్‌లో రాజకీయాలను మిళితం చేసి బీసీసీఐ క్రీడా ప్రపంచంలో తనకు ఉన్న క్రెడిబిలిటీని కోల్పోయింది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ కమాండర్‌ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న దేశాలను వరల్డ్‌కప్‌ నుంచి బహిష్కరించాలని, అటువంటి దేశాలతోఆడ బోమని బీసీసీఐ.. ఐసీసీకి లేఖ రాసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీబీ... లీగ్‌ దశలో టీమిండియాతో మ్యాచ్‌లు ఆడమని, కానీ నాకౌట్‌ దశలో ఇరు జట్లు ఎదురుపడితే అప్పుడేం చేస్తారనే ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు