హరికృష్ణకు మిశ్రమ ఫలితాలు

22 Jun, 2020 00:07 IST|Sakshi

న్యూఢిల్లీ: చెసేబుల్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణకు మిశ్రమ ఫలితాలు లభించాయి. టోర్నీ రెండో రోజు ఆదివారం హరికృష్ణ ఒక గేమ్‌ను ‘డ్రా’గా ముగించి, మరో గేమ్‌లో గెలిచాడు. తొలి రోజు ఆడిన మూడు గేముల్లోనూ ఓడిపోయిన హరికృష్ణ నాలుగో రౌండ్‌ గేమ్‌లో హికారు నకముర (అమెరికా)తో 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అలెగ్జాండర్‌ గ్రిషుక్‌ (రష్యా)తో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌లో హరికృష్ణ 28 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు ఉన్న గ్రూప్‌ ‘ఎ’లో హరికృష్ణ ఒకటిన్నర పాయింట్లతో చివరిస్థానంలో ఉన్నాడు. గ్రూప్‌ ‘బి’లో మరో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ గేమ్‌లు పూర్తయ్యాక రెండు గ్రూపుల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు క్వార్టర్‌ ఫైనల్‌ నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తారు. రెండో విడత గేమ్‌లు మిగిలి ఉండటంతో హరికృష్ణకు నాకౌట్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు