‘క్యాండిడేట్స్‌’కు అర్హతే లక్ష్యం

12 Mar, 2017 08:45 IST|Sakshi
‘క్యాండిడేట్స్‌’కు అర్హతే లక్ష్యం

గ్రాండ్‌ప్రి’లతో మంచి అవకాశం
ఇది నా కెరీర్‌లో అత్యుత్తమ దశ
‘సాక్షి’తో గ్రాండ్‌మాస్టర్‌ హరికృష్ణ   


భారత చెస్‌ చరిత్రలో విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటి ఆటకు మరింత గుర్తింపు తెచ్చిన ఆటగాడు పెంటేల హరికృష్ణ. సుదీర్ఘ కాలంగా నిలకడగా విజయాలు సాధిస్తున్న ఈ తెలుగు ఆటగాడి కెరీర్‌ ఇటీవల మరింత ఊపందుకుంది. కొద్ది మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు మాత్రమే అందుకోగలిగిన 2770 రేటింగ్‌కు ఇటీవలే హరికృష్ణ చేరుకోవడం పెద్ద విశేషం. ప్రస్తుతం ఆటపరంగా తన అత్యుత్తమ దశలో ఉన్నానని హరి చెబుతున్నాడు. తన ప్రదర్శన, భవిష్యత్తు టోర్నీలు తదితర అంశాలపై ‘సాక్షి’ క్రీడా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వూ్య విశేషాలు అతని మాటల్లోనే...

2770 రేటింగ్‌ సాధించడంపై...
ప్రస్తుత అంతర్జాతీయ చెస్‌ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే 2770 రేటింగ్‌ను అరుదైన ఘనతగా చెప్పవచ్చు. దీనిని సాధించడం ద్వారా తక్కువ మందికే చోటున్న ‘ఎలైట్‌’ గ్రూప్‌కి చేరుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ రేటింగ్‌ కారణంగా ఎప్పుడో ఒకసారి టాప్‌ ప్లేయర్‌తో తలపడటం కాకుండా ఇక తరచుగా అగ్రస్థాయి టోర్నీలలో నేను వారిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అక్కడ మంచి విజయాలు లభిస్తే దానికి దక్కే గుర్తింపు, విలువ చాలా ఎక్కువ.

ఇటీవలి ప్రదర్శనపై...
ఒక్క మాటలో చెప్పాలంటే నా కెరీర్‌లో ఇది అత్యుత్తమ దశ. రేటింగ్‌తో పాటు వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లోకి అడుగు పెట్టాను. గత రెండేళ్లుగా నేను పడిన శ్రమకు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. చైనా టోర్నీలో రెండో స్థానంలో నిలవగా, ఒలింపియాడ్‌లో నాలుగో స్థానంతో త్రుటిలో పతకం చేజారింది. 2016 నుంచి ఓపెన్, లీగ్‌ టోర్నీలను చాలా వరకు తగ్గించి ప్రధాన టోర్నమెంట్‌లపై దృష్టి పెట్టాను. టాటా స్టీల్‌ టోర్నీలో కొన్ని సార్లు విజయావకాశాలు లభించినా వాటిని ఉపయోగించుకోలేకపోవడంతో తుది ఫలితం గొప్పగా లేదు. వరల్డ్‌ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌ సన్‌తో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌ ‘డ్రా’గా ముగియడం చెప్పుకోదగ్గ అంశం. ఒక్క రోజే అయినా... ఆనంద్‌ను కూడా ర్యాంకుల్లో అధిగమించగలగడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

భారత్‌లో చెస్‌ పురోగతిపై...
దశాబ్దం క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా వేగంగా భారత చెస్‌ ఎదుగుతోంది. గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య పెరగడం ఒక్కటే కాదు, ఆటగాళ్ల పరిజ్ఞానం కూడా చాలా పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోవడం వల్ల ఆట వ్యూహాల్లో కూడా కొత్త తరహాలో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే దీని వల్ల పోటీ కూడా పెరిగింది. ఓవరాల్‌గా సాధిస్తున్న విజయాలను బట్టి చూస్తే చాలా మెరుగైందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

తదుపరి లక్ష్యాలపై...
2017 నా కెరీర్‌లో కీలక సంవత్సరం కానుంది. వచ్చే నెలలో చైనా, అజర్‌బైజాన్‌లలో రెండు పెద్ద టోర్నమెంట్‌లు ఉన్నాయి. అంతకంటే ప్రధానమైనవి ఈ ఏడాది జరిగే మూడు గ్రాండ్‌ప్రి టోర్నీలు. ఈ మూడు టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే లేదా సెప్టెంబర్‌లో జార్జియాలో జరిగే ప్రపంచకప్‌లోనైనా ఫైనల్‌ చేరితే క్యాండిడేట్స్‌ టోర్నీ ఆడేందుకు అర్హత సాధిస్తాను. ప్రస్తుతం నా లక్ష్యం అదే. ప్రపంచంలోని టాప్‌–8 ఆటగాళ్లు మాత్రమే తలపడే క్యాండిడేట్స్‌ టోర్నీలో పాల్గొనడం అన్నింటికంటే ముఖ్యం. ఆ టోర్నీ విజేతకు వరల్డ్‌ చాంపియన్‌ను ఢీకొట్టే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం నా సన్నాహకాలు, ఫామ్‌ చాలా బాగున్నాయని, సరైన దిశలోనే వెళుతున్నానని నమ్ముతున్నా. గతంలో నాలో ఉన్న ఓపెనింగ్‌ లోపాలను ఇప్పటికే సరిదిద్దుకున్నా. నా ముగ్గురు సహాయకులు (సెకండ్స్‌) రాబోయే టోర్నీల సన్నద్ధతలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక్కడ టోర్నీలలో పాల్గొనకపోవడంపై...
నేను ఆఖరిసారిగా భారత్‌లో 2004లో ఆడాను. దురదృష్టవశాత్తూ మన దేశంలో పెద్ద స్థాయి టోర్నీల నిర్వహణ విషయంలో ఫెడరేషన్‌ చొరవ తీసుకోవడం లేదు. ఆదరణ ఉండదు, స్పాన్సర్లు రారు అనడంలో వాస్తవం లేదు. ఇటీవల క్రికెటేతర క్రీడలకు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో చెస్‌ను కూడా అనుసరించేవారు బాగా పెరిగారు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. నిజానికి ఫెడరేషన్‌లో వేల సంఖ్యలో ఉన్న రిజిస్టర్డ్‌ ఆటగాళ్లు సదరు టోర్నీని అనుసరించినా అది సక్సెస్‌ అయినట్లే! ఇక నేను, ఆనంద్‌లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనకపోవడానికి తగినంత పోటీ లేకపోవడమే కారణం. మా రేటింగ్‌కు కాస్త అటూ ఇటుగా ఉన్న ఆటగాళ్లతో పర్వాలేదు గానీ మరీ తక్కువ స్థాయి ఆటగాళ్లతో తలపడితే మాకు ప్రయోజనంకంటే నష్టమే ఎక్కువ. గతంలో మన దేశంలో పలుసార్లు జరిగిన నిర్వహణా లోపాలు కూడా మమ్మల్ని ఆడకుండా నిరోధిస్తున్నాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు