అవకాశాలు చేజార్చుకున్నాం

13 Sep, 2018 00:59 IST|Sakshi

సిరీస్‌లో శుభారంభం లభించడం ముఖ్యం

భారత కెప్టెన్‌ కోహ్లి వ్యాఖ్య

రాహుల్, పంత్‌లపై ప్రశంసలు

లండన్‌: విదేశీ గడ్డపై టెస్టు సిరీస్‌లు గెలవాలంటే కీలక సమయాల్లో అందివచ్చిన అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని, అలా చేయడంలో తాము విఫలమయ్యామని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యానించాడు. మంగళవారం ఓవల్‌ మైదానంలో చివరి టెస్టులో పరాజయంతో సిరీస్‌ను 1–4తో ముగించిన అనంతరం అతను మీడియాతో మాట్లాడాడు. ‘విదేశాల్లో ఆడటం కష్టంగా అనిపించే సిరీస్‌గా మేము దీనిని భావించడం లేదు. నిజానికి మేం చాలా బాగా ఆడగలం. అయితే ప్రత్యర్థితో పోలిస్తే కొన్ని కీలక సమయాల్లో మాకు లభించిన అవకాశాలను సరిగా వాడుకోలేకపోయాం. భవిష్యత్తులో మాత్రం ఈ తప్పు జరగనివ్వం. ఏదో ఒక టెస్టు గెలిచేసి సంబరపడిపోకుండా సిరీస్‌ గెలవడంపైనే దృష్టి పెడతాం’ అని కోహ్లి అన్నాడు. సిరీస్‌లో శుభారంభం లభించడం కూడా ముఖ్యమని అతను చెప్పాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో మంచి అవకాశాలు చేజార్చుకున్న భారత్‌ చివరకు 31 పరుగుల తేడాతో ఓడింది. ‘సిరీస్‌ గెలవాలంటే ఆరంభం కూడా బాగుండాలి. ఎప్పుడైనా మొదటి టెస్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తొలి దెబ్బ మనదైతే అంతా బాగుందని అర్థం. మున్ముందు గెలవవచ్చులే అనుకుంటూ ఆడితే లాభం లేదు’ అని విశ్లేషించాడు.  

మరీ బాధ పడాల్సిందేమీ లేదు... 
ఇంగ్లండ్‌ చేతిలో చిత్తుగా ఓడినా తమ ప్రదర్శన అతిగా విచారించాల్సిన విధంగా ఏమీ లేదని కోహ్లి అభిప్రాయపడ్డాడు. పైగా జట్టులో భారీ మార్పులు చేయాల్సిన అవసరం కూడా లేదని అతను స్పష్టం చేశాడు. ‘ఈ సిరీస్‌లో ఇలాంటి ఫలితం ఎందుకు వచ్చిందో అందరికీ బాగా తెలుసు. కాబట్టి భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదు. ప్రతీ మ్యాచ్‌లో ఏదో ఒక దశలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ దాదాపు ప్రతీ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వగలిగామంటే... బాగానే ఆడామని అర్థం. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలిగినా దానిని ఎక్కువ సమయం కొనసాగించలేకపోయాం. ఫలితంకంటే మేం ఏ తరహాలో ఆడామన్నది ముఖ్యం. కాబట్టి గత దక్షిణాఫ్రికా సిరీస్‌తో పాటు ఇక్కడి పరాజయాలు మరీ ఎక్కువగా బాధించడం లేదు’ అని కోహ్లి వివరించాడు.  

గెలుపు కోసమే ప్రయత్నించాం... 
చివరి రోజు టీ విరామ సమయంలో రాహుల్, పంత్‌ క్రీజ్‌లో ఉండగా భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నట్లు కోహ్లి చెప్పాడు. ‘రాహుల్, పంత్‌ ఆడుతున్న తీరు చూస్తే గెలుపు సాధ్యమే అనిపించింది. వారిద్దరు ఆ నమ్మకాన్ని పెంచారు. సిరీస్‌లో అప్పటి వరకు బాగా ఆడని రాహుల్, పెద్దగా అంచనాలు లేని పంత్‌ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చారు. చివరకు గెలుపు దక్కలేదు కానీ వారిద్దరు కెరీర్‌లో గుర్తుంచుకునే ప్రదర్శన చేశారు. మా ఆలోచనలను, దృక్పథాన్ని ఈ సిరీస్‌ చూపించింది. గతంలోనే కొన్ని జట్లయితే ముందే చేతులెత్తేసేవి. కానీ మేం అలా చేయలేదు. ఇక మా బౌలర్లనయితే ప్రత్యేకంగా అభినందించక తప్పదు. వారి వల్లే చాలా సందర్భాల్లో మేం ముందంజలో నిలిచాం’ అని కోహ్లి చెప్పాడు.

గత 15 ఏళ్లలో ఇంతకంటే మెరుగైన భారత జట్టు లేదంటూ చివరి టెస్టుకు ముందు కోచ్‌ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన పాత్రికేయుడికి కోహ్లి కాస్త అసహనంతో జవాబిచ్చాడు. ‘మాది మెరుగైన జట్టని మాపై మాకు నమ్మకముండాల్సిందే. అందులో తప్పేముంది. ఒకవేళ మీరు అలా భావించకపోతే మీ ఇష్టం. అది మీ అభిప్రాయం మాత్రమే. థ్యాంక్యూ’ అంటూ కోహ్లి సమాధానమిచ్చాడు. మరోవైపు రిటైర్మెంట్‌ ప్రకటించిన కుక్‌ను విరాట్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. ‘కుక్‌ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఎప్పుడూ అతను తన గీత దాటలేదు. ఏ ఒక్కరినీ ఒక్క మాట కూడా అనకుండా తన పని చేసుకుంటూ పోయాడు. ఇలాంటి వ్యక్తుల వల్లే టెస్టు క్రికెట్‌పై చాలా మందికి అభిమానం పెరుగుతుంది. 161 టెస్టులు ఆడి ప్రపంచవ్యాప్తంగా పరుగులు సాధించడం అతని పట్టుదలను నిదర్శనం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. 

మరిన్ని వార్తలు