‘ఇంగ్లండ్‌ ఓడాలని కోరుకుంటున్నారు’

28 Jun, 2019 20:58 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది.  ఆసీస్‌, శ్రీలంక చేతిలో పరాజయాలు చవి చూసిన తర్వాత ఇయాన్‌ మోర్గాన్‌ సేనపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు మైకేల్‌ వాన్‌, కెవిన్‌ పీటర్సన్‌లు మండిపడ్డారు. వరల్డ్‌కప్‌ వేదికలో ఇంగ్లండ్‌కు ఇది అత్యంత చెత్త ప్రదర్శన అంటూ వాన్‌ తీవ్రంగా విమర్శించగా, మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌ను చూసి మోర్గాన్ వెనుకడుగు వేశాడు అంటూ పీటర్సన్‌ ధ్వజమెత్తాడు. ఇలా తమపై వస్తున్న విమర్శలపై ఓపెనర్‌ బెయిర్‌ స్టో ఘాటుగా బదులిచ్చాడు. ‘ మా జట్టు సమిష్టి పోరాటంలో ఎటువంటి వెనుకంజ లేదు. వన్డే ఫార్మాట్‌లో గడిచిన మూడేళ్ల కాలంలో అద్భుతాలు విజయాలు సాధించాం.

దాదాపు ప్రస్తుతం ఉన్న జట్టుతోనే నంబర్‌ ర్యాంకును సుదీర్ఘ కాలం కాపాడుకున్నాం. అసలు వరల్డ్‌కప్‌లో మేము ముందుకు వెళ్లకూడదనే చాలా మంది కోరుకుంటున్నారు. మేము పరాజయం చెందితే చూసి ఆనందించాలని చాలామంది అనుకుంటున్నారు. అందుకే ఈ తరహా విమర్శలు చేస్తున్నారు’ అని బెయిర్‌ స్టో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సహచరులకు బెయర్‌ స్టో విజ్ఞప్తి చేశాడు. వాటిని పట్టించుకోకుండా రిలాక్స్‌ ముందుకు సాగుదామని పిలుపునిచ్చాడు.  ఇంగ్లండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో ఆ జట్టు పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడింది. వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరాలంటే ఆ రెండు మ్యాచ్‌ల్లో విజయం ఇంగ్లండ్‌ అవసరం. అందులోనూ భారత్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఇంగ్లండ్‌కు మ్యాచ్‌లు మిగిలి ఉన్న తరుణంలో ఆ జట్టు ఎంతవరకూ నెట్టికొస్తుందో అనేది ఆసక్తికరం.


 

మరిన్ని వార్తలు