అంతా ధోనిమయం!

21 Mar, 2019 00:00 IST|Sakshi

టైటిల్‌ నిలబెట్టుకునే ప్రయత్నంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 

సీనియర్లతో పోరుకు సిద్ధం

ఐపీఎల్‌ మరో 2  రోజుల్లో

ఐపీఎల్‌లో 148 మ్యాచ్‌లు ఆడితే 90 విజయాలు...అందరికంటే ఎక్కువగా 61.56 విజయ శాతం... తొమ్మిది సార్లు బరిలోకి దిగితే ఏడు సార్లు ఫైనల్‌కు... అందులో మూడు సార్లు టైటిల్‌ విజయం... ఒక్కసారి కూడా లీగ్‌ దశకు పరిమితం కాని జట్టు... మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రత్యేకతల గురించి చెప్పుకోవాలంటే వాటిలో ఇవి కొన్నే... మైదానం బయట చూస్తే అశేష అభిమానులతో అందరికంటే ఎక్కువ ఆదరణ ఉన్న టీమ్‌... ‘విజిల్‌ పొడు’ అంటే చాలు ఉత్సాహంతో ఊగిపోయే వీరి అభిమానం వల్లే కావచ్చు... రెండేళ్లు ఆటకు దూరమైనా, తిరిగి రాగానే మళ్లీ విజయ పతాకం ఎగరవేయగలిగింది. గత ఏడాదిలాగే దాదాపు అదే ప్రధాన బృందంతో చెన్నై మరో టైటిల్‌ వేటకు సన్నద్ధమైంది. ఆటగాళ్లు ఎందరు మారినా ఎప్పటిలాగే తమిళ్‌ తలైవాస్‌ జట్టుకు కర్త, కర్మ, క్రియ మళ్లీ ధోనినే. మరోసారి అతని నాయకత్వం జట్టుకు నాలుగో ట్రోఫీని అందిస్తుందా చూడాలి.   

బలాలు: ధోని కెప్టెన్‌గా ఉండటమే చెన్నైకి ముందుగా వేయి ఏనుగుల బలం. ఎలాంటి జట్టుతోనైనా విజయాలు సాధించగల నైపుణ్యం, ఎలాంటి స్థితి నుంచైనా జట్టును రక్షించగల సామర్థ్యం, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగల సత్తా ఉన్న ధోని వల్లే సూపర్‌ కింగ్స్‌ ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు కూడా అతని వ్యూహప్రతివ్యూహాలే జట్టు ప్రస్థానాన్ని నిర్దేశిస్తాయనడంలో సందేహం లేదు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌ల (176) అనుభవం ఉన్న ‘చిన్న తలా’ రైనా, టీమిండియాలో రెగ్యులర్‌గా మారిన కేదార్‌ జాదవ్, అంబటి రాయుడు జట్టును గెలిపించగల సత్తా ఉన్నవాళ్లు. వెటరన్లు డ్వేన్‌ బ్రేవో, షేన్‌ వాట్సన్, డు ప్లెసిస్‌ జట్టుకు అదనపు బలం. ఈ బృందం సమష్టిగా చెలరేగితే చెన్నై మళ్లీ లీగ్‌ కింగ్స్‌గా నిలవడం ఖాయం. పేస్‌ బౌలింగ్‌ భారం భారత్‌ నుంచి మోహిత్‌ శర్మ, శార్దుల్‌ ఠాకూర్, దీపక్‌ చహర్‌ మోస్తుండగా... స్పిన్‌లో హర్భజన్, ఇమ్రాన్‌ తాహిర్, కరణ్‌ శర్మ ఉన్నారు. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు తిరుగులేదు. విడిగా చూస్తే కొందరు ఆటగాళ్లు ‘అద్భుతం’ అనిపించకపోయినా, ధోని మార్గనిర్దేశనంలో వారంతా అత్యుత్తమ ఆటను ప్రదర్శించగలరని గతంలో చాలా సార్లు రుజువైంది. కాబట్టి ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటే చెన్నై మళ్లీ దూసుకుపోవచ్చు.  

బలహీనతలు: ప్రధాన పేసర్‌గా బాధ్యతలు తీసుకోవాల్సిన లుంగీ ఇన్‌గిడి (దక్షిణాఫ్రికా) గాయంతో లీగ్‌కు దూరమవుతున్నట్లు బుధవారమే వెల్లడించాడు. ఇది జట్టు కూర్పును కొంత వరకు దెబ్బ తీయవచ్చు. గత ఏడాది కేవలం 6 ఎకానమీతో 11 వికెట్లు తీసిన అతను ఆరంభంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పూర్తిగా కట్టిపడేశాడు. గత ఏడాది విజయంలో భాగమైన ఎక్కువ మంది ఈ సారి జట్టులో ఉన్నారు. కానీ ఏడాది కాలంలో వారి ఆట చాలా మారింది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు లీగ్‌లలో ఆడుతున్న బ్రేవో పెద్దగా ప్రభావం చూపకపోగా, గత నవంబర్‌లో రంజీ ట్రోఫీ తర్వాత మోహిత్‌ శర్మ కనీసం ఒక్క వన్డే లేదా టి20 మ్యాచ్‌ కూడా ఆడలేదు. గత ఏడాది ఐపీఎల్‌ తర్వాత పంజాబ్‌ తరఫున మూడే టి20లు ఆడి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. రైనా కూడా ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 6 మ్యాచ్‌లు ఆడితే ఒకదాంట్లో మినహా ఐదింటిలో ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్‌ కోసమే తిరిగి వస్తుండ టంతో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కూడా చాలా మందికి లేదు. విదేశీ ఆటగాళ్ళలో బిల్లింగ్స్, విల్లీ, సాన్‌ట్నర్‌ ఎలా ఆడతారో చూడాలి. మొత్తంగా మరోసారి చెన్నై గెలుపు ధోనిపైనే ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు.  

జట్టు వివరాలు: ధోని (కెప్టెన్‌), రాయుడు, హర్భజన్, జాదవ్, రుతురాజ్, విజయ్, జడేజా, దీపక్‌ చహర్, జగదీశన్, రైనా, ఆసిఫ్, శార్దుల్, ధ్రువ్, మోహిత్, మోను కుమార్, బిష్ణోయ్, కరణ్‌ శర్మ (భారత ఆటగాళ్లు), తాహిర్, బిల్లింగ్స్, విల్లీ, డు ప్లెసిస్, బ్రేవో, వాట్సన్, సాన్‌ట్నర్‌ (విదేశీ ఆటగాళ్లు)  

అత్యుత్తమ ప్రదర్శన:
 2009, 2010లలో చాంపియన్‌గా నిలిచిన చెన్నై 2018లో మరోసారి టైటిల్‌ సాధించింది. నాలుగు సార్లు (2008, 2012, 2013, 2015) రన్నరప్‌గా నిలిచింది. గత ఏడాది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన టీమ్‌ ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది.  

>
మరిన్ని వార్తలు