ట్యాంపరింగ్‌తో సంబంధం లేదు: ఆసీస్‌ ఆటగాడు

28 Jul, 2018 08:48 IST|Sakshi
పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌

సిడ్నీ : దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌​సందర్భంగా చోటుచేసుకున్న బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం యావత్‌ క్రికెట్‌ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌. గత మార్చిలో సఫారీతో మూడో టెస్టు సందర్భంగా ఆసీస్‌ యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ సాండ్‌ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసి కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో హ్యాండ్స్‌కాంబ్‌కు సంబంధం ఉందని ప్రచారం జరిగింది. అప్పటి కోచ్‌ డారెన్‌ లీమన్‌ సూచనల మేరకు హ్యాండ్స్‌కాంబ్‌ బాన్‌క్రాఫ్ట్‌ను అప్రమత్తం చేశాడని ఓ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. తాజాగా ఈ ఆరోపణలను హ్యాండ్స్‌కాంబ్‌ ఖండించాడు. ఆ వీడియో ఎడిట్‌ చేసిందని, ఆ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు.

ఆ వీడియోలో ఏముందంటే.. బాన్‌క్రాఫ్ట్‌ సాండ్‌ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండగా.. అది కెమెరాల్లో స్పష్టమైంది. దీన్నిగమనించిన కోచ్‌ లీమన్‌ వాకీటాకీ ద్వారా హ్యాండ్స్‌కాంబ్‌కు తెలియజేశాడు. దీంతో అతను నవ్వుతూ.. ఎదో మాట్లాడుతున్నట్లు చేస్తూ బాన్‌క్రాఫ్ట్‌ను హెచ్చరించగా.. అతను సాండ్‌పేపర్‌ను లోదుస్తుల్లో దాచాడు. అయితే తను ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, అతన్ని అప్రమత్తం కూడాచేయలేదని, ఓ జోక్‌ వేసనంతేనని హ్యాండ్స్‌కాంబ్‌ స్పష్టం చేశాడు. ఇక ఈ వివాదంతో అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌లపై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది నిషేదం విధించగా.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు