ఐపీఎల్‌పై నీలినీడలు.. టికెట్లపై నిషేధం..!

11 Mar, 2020 20:55 IST|Sakshi

 ఐపీఎల్‌ వాయిదా కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌

వాయిదా కోరుతున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు

రేపు కీలక ప్రకటన చేయనున్న మహా సర్కార్‌

ఐపీఎల్‌-2020 నిర్వహణపై సందిగ్ధత

సాక్షి, ముంబై : చైనాలోని వుహాన్‌ నగరంలో పురుడుపోసుకున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కొద్దికాలంలోనే ప్రపంచ దేశాలను చుట్టిముట్టింది. ఏ రంగాన్నీ వదలకుండా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆఖరికి క్రీడారంగంపై కూడా తన ప్రభావాన్ని చూపుతోంది.  కరోనా కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు రద్దు అయిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రపంచమంతాఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసే టోక్యో-2020 ఒలింపిక్స్‌ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా కరోనా ప్రభావం ఐపీఎల్‌-2020ను సైతం తాకింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మెగా టోర్నీని నిర్వహించి తీరుతామని ఓవైపు బీసీసీఐ ముక్తకంఠంతో చెబుతుండగా.. వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో పౌరుల  ఆరోగ్య భద్రత దృష్ట్యా ఐపీఎల్‌ టోర్నీని తాత్కాలికంగా వాయిదా వేయాలని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు బీసీసీఐని కోరాయి. మరోవైపు ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ అనుమతి నిరాకరించాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో జి అలెక్స్‌ బెంజిగర్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. (కరోనా భయం.. ఐపీఎల్‌ సాధ్యమేనా?)

ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ టికెట్లపై నిషేధం విధించాలని మహారాష్ట్రలోని మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ముంబైలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి  రాజేష్‌ తోపే ఐపీఎల్‌ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు.  బుధవారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి రాజేష్‌ తోపే మాట్లాడుతూ.. ‘నేడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఐపీఎల్‌పై సుదీర్ఘంగా చర్చించాం. ప్రపంచ వ్యాప్తంగా పౌరుల ప్రాణాలను హరిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృభిస్తున్న తరుణంలో టోర్నీని వాయిదా లేదా రద్దు చేయాలని బీసీసీఐని కోరాలని నిర్ణయించుకున్నాం. దీనిపై గురువారం మరోసారి చర్చించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను సైతం తాత్కాలిక లేదా నిరవధిక వాయిదా కూడా వేసే అవకాశం ఉంది. దీనిపై రేపు నిర్ణయం తీసుకుంటాం’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. (ఐపీఎల్‌ ప్రైజ్‌మనీలో భారీ కోత)

కాగా ఐపీఎల్‌-2020 షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29తో ముంబైలోని ప్రఖ్యాత వాంఖడి మైదానం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య ఆరంభ పోరు ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యంగా ప్రజలకు అవసరం ఉంటే తప్ప పెద్ద ఎత్తున ఒకే దగ్గర గుంపులు గుంపులుగా ఉండొద్దని ఆదేశాలు జారీచేశారు. దీనిలో భాగంగానే ఐపీఎల్‌ టికెట్లపై కూడా నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ప్రపంచంలో చాలా వరకు టోర్నీలు జరుగుతున్నాయని, కరోనా కారణంగా ఐపీఎల్‌కు ఎలాంటి ప్రమాదంలేదని వాదిస్తోంది.  ఇరు వర్గల వాదనల నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని వార్తలు