ఫైనల్లో క్విటోవా, బౌచర్డ్

4 Jul, 2014 01:27 IST|Sakshi
ఫైనల్లో క్విటోవా, బౌచర్డ్

 సెమీస్‌లో పేస్ జోడి  
 మిక్స్‌డ్‌లో సానియా ద్వయం ఓటమి
 
 లండన్: మూడేళ్ల తర్వాత మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా... వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో 6వ సీడ్ క్విటోవా (చెక్) 7-6 (8/6), 6-1తో 23వ సీడ్ లూసి సఫరోవా (చెక్)పై విజయం సాధించింది. 80 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 24 విన్నర్స్, 8 ఏస్‌లతో ప్రత్యర్థిని వణికించింది. బలమైన గ్రౌండ్ స్ట్రోక్‌లను సంధిస్తూ బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో తొలి గేమ్‌లో సఫరోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే వెంటనే తేరుకున్న సఫరోవా నాలుగో గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌లో నిలిచింది. టైబ్రేక్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన క్విటోవా తొలి సెట్ పాయింట్‌ను చేజార్చుకున్నా... ఈ అవకాశాన్ని సఫరోవా సద్వినియోగం చేసుకోలేకపోయింది. చివరకు బలమైన విన్నర్‌తో ఆరోసీడ్ ప్లేయర్ సెట్‌ను ముగించింది. రెండోసెట్ రెండో గేమ్‌లో సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్విటోవా ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది.
 
 ఆరో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌ను కాపాడుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో సెమీస్‌లో 13వ సీడ్ ఎగుని బౌచర్డ్ (కెనడా) 7-6 (5), 6-2తో 3వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచింది. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి కెనడా మహిళా ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. గంటా 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని విజయం సాధించింది. రెండోసెట్‌లో బ్రేక్ పాయింట్ వద్ద హలెప్ డబుల్ ఫాల్ట్ చేయడం బౌచర్డ్‌కు కలిసొచ్చింది.
 
 సెమీస్‌లో పేస్ జోడి
 పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఐదోసీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్) జోడి 3-6, 7-6 (5), 6-3, 6-4తో మూడోసీడ్ నెస్టర్ (కెనడా)-జిమోన్‌జిక్ (సెర్బియా)పై నెగ్గి సెమీస్‌కి చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ మూడో రౌండ్‌లో సానియా మీర్జా (భారత్)-టెకాయు (రొమేనియా) ద్వయం 5-7, 3-6తో జెమీ ముర్రే (బ్రిటన్)-డెల్లాక్వా (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది.
 

మరిన్ని వార్తలు