క్విటోవాకు చుక్కెదురు

30 Aug, 2019 07:22 IST|Sakshi

రెండో రౌండ్‌లో ఓడిన ఆరో సీడ్‌

యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ  

న్యూయార్క్‌: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రన్నరప్, ఆరో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఆమె 4–6, 4–6తో ప్రపంచ 88వ ర్యాంకర్‌ పెట్కొవిక్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ యాష్లే బార్టీ, ఐదో సీడ్‌ స్వితోలినా, పదో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ ముందంజ వేశారు. స్థానిక అక్కాచెల్లెళ్లకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. అక్క వీనస్‌ విలియమ్స్‌ ఆట ముగియగా, చెల్లి సెరెనా విలియమ్స్‌  మూడో రౌండ్లోకి ప్రవేశించింది.  రెండో సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–2, 7–6 (7/2)తో అమెరికాకు చెందిన లారెన్‌పై చెమటోడ్చి నెగ్గింది. 

ఏడో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) ఏడు సార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ అయిన వీనస్‌ను 6–4, 6–4తో ఓడించింది. 2017 రన్నరప్‌ కీస్‌ (అమెరికా) 6–4, 6–1తో జు లిన్‌ (చైనా)పై గెలిచింది. 17 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయి మెక్‌నాలీ అమెరికన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌తో ఓ ఆటాడుకుంది. తొలిసెట్‌ను గెలిచి తమ దేశానికే చెందిన దిగ్గజానికి ముచ్చెమటలు పట్టించింది. రెండో సెట్‌లో కోలుకున్న అమెరికా నల్లకలువ 5–7, 6–3, 6–1తో మెక్‌నాలీ (అమెరికా)పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 6–4, 7–6 (7/3), 6–1తో 56వ ర్యాంకర్‌ ఇగ్నాసియో (అర్జెంటీనా)పై గెలిచాడు. మూడో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 3–6, 6–2, 6–3, 6–4తో జుమ్‌హుర్‌ (బోస్నియా)పై నెగ్గాడు.

మరిన్ని వార్తలు