కోచ్ పదవికి మరో దరఖాస్తు..?

3 Jul, 2017 16:09 IST|Sakshi
కోచ్ పదవికి మరో దరఖాస్తు..?

ముంబై: భారత ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. తాజాగా వెస్టిండీస్ మాజీ కోచ్ పిల్ సిమన్స్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. విండీస్ టీ20 ప్రపంచకప్ విజయంలో సిమన్స్ కోచ్ గా కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ మాజీ ఆటగాడు ఐర్లాండ్, జింబాంబ్వే జట్లకు కూడా కోచ్ గా వ్యవహరించాడు.  ఇక కోచ్ గా సిమన్స్ కు మంచి రికార్డు ఉంది. ఐర్లాండ్ జట్టుకు సిమన్స్ కోచ్ గా ఎనిమిదేళ్లు సేవలందించాడు. 2011, 2015 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ సంచలన విజయాల్లో సిమన్స్ పాత్ర కీలకం.

చాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కోచ్ పదవి కోసం మరన్ని దరఖాస్తులు ఆహ్వానిస్తూ బీసీసీఐ జూలై 9 వరకు గడువును పొడిగించింది. ఇప్పటికే కోచ్ రేసులో భారత మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి, సెహ్వాగ్, దొడ్డా గణేశ్, లాల్ చంద్ రాజ్ పుత్ లు ఉండగా విదేశీ మాజీ ఆటగాళ్లలో రిచర్డ్ పైబస్, టామ్ మూడీ, తాజాగా పిల్ సిమన్స్ చేరాడు. అయితే వీరందరిని సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహామండలి ఇంటర్వ్యూలు చేయనుంది. జులై 10న కొత్త కోచ్ ను ప్రకటిస్తామని రెండు రోజుల క్రితం గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు