'దంగల్‌' సిస్టర్స్‌కు ఏమైంది..?

8 Jan, 2017 18:56 IST|Sakshi
'దంగల్‌' సిస్టర్స్‌కు ఏమైంది..?

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ నటించిన స్పోర్ట్స్‌ డ్రామా దంగల్‌ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. అందరి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. హరియాణాకు చెందిన కుస్తీవీరుడు మహావీర్‌ పొగట్‌ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పొగట్‌ కుమార్తెలు గీతా పొగట్‌, బబితా పొగట్‌ చాంపియన్లుగా ఎదిగిన తీరు ఈ సినిమా కథ. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పతకాలు అందించిన గీత, బబితలు క్రీడాభిమానులకు సుపరిచితమే. కాగా దంగల్‌ సినిమా తర్వాత ఈ సిస్టర్స్కు మరింత క్రేజ్‌ పెరిగింది. అసలు విషయం ఏంటంటే ప్రో రెజ్లింగ్‌ లీగ్‌లో పొగట్‌ సిస్టర్స్‌ యూపీ దంగల్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఈ సీజన్లో వీరిద్దరూ కొనసాగేది సందేహంగా మారింది.

గీత జ్వరంతో, బబిత గాయంతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో వీరిద్దరూ టోర్నీకి అందుబాటులో ఉండేది కష్టమని యూపీ దంగల్‌ టీమ్‌ వర్గాలు తెలిపాయి. వీరి స్థానాల్లో ఇతరులను తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారత రెజ్లింగ్‌ సమాఖ్యను కోరినట్టు తెలుస్తోంది. మహిళల 53 కిలోల విభాగంలో బబిత స్థానంలో పింకి, 58 కిలోల విభాగంలో గీత స్థానంలో మనీషా పేర్లను సూచించారు. కాగా జట్టు నుంచి గీత, బబిత వైదొలగరని, టోర్నీలో వారు జట్టుతో కలసి ఉంటారని, అయితే తదుపరి పోటీలలో పాల్గొనకపోవచ్చని ఓ అధికారి చెప్పారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు