జాలి వద్దు.. జాబు కావాలి..

4 Feb, 2020 12:33 IST|Sakshi

క్రికెట్‌లో రాణిస్తున్న దివ్యాంగ క్రీడాకారుడు

దోశలు వేసుకుంటూ కుటుంబ పోషణ

నేషనల్‌ డిజేబుల్డ్‌ క్రికెట్‌ పోటీలకు దేవరాజ్‌

తిరుపాపులి దేవరాజ్‌... దివ్యాంగుల క్రికెట్‌లో ఈయన పేరు తెలియని వారుండరు.. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూరాణిస్తున్నాడు.. జీవనపోరాటంలో విజయం సాధించలేక.. నమ్ముకున్న కుటుంబాన్ని పోషించుకునేందుకు బ్యాట్‌ పట్టిన చేతితో దోశలు.. బౌలింగ్‌ వేసిన చేత్తో వడలు వేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాడు.. తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం సాయమందించాలని వేడుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ఎందరో అధికారుల చుట్టూ తిరిగానని.. నన్ను చూసి జాలిపడి..డబ్బులిచ్చి పంపేయత్నం చేస్తున్నారే తప్ప.. కుటుంబపోషణకు అవసరమైన ఉద్యోగమిచ్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదంటున్నాడు.. ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని కోరుతున్నాడు.

కడప స్పోర్ట్స్‌ : కడప నగరం రామాంజనేయపురానికి చెందిన తిరుపాపులి దేవరాజ్‌కు క్రికెట్‌ అంటే ఎంతో మక్కువ.  2–3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే పాము కాటేసింది.. ఆ సమయంలో నాటు వైద్యం చేశారు. ఇది వికటించడంతో ఎడమకాలు చచ్చుబడింది. ఫలితంగా అవిటిగా మారాడు... తోటి వారందరూ ఆడుకోవడం చూసిన తనకు ఇష్టమైన క్రికెట్‌ ఆడటం ప్రారంభించాడు. కొందరు నువ్వు కుంటివాడివి.. క్రికెట్‌కు పనికిరావని అన్నారు.. అయినా క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఆడటం ప్రారంభించాడు.  1993–94 సంవత్సరంలో పదోతరగతి చదువుతున్నప్పుడు వికలాంగులకు క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్నాడు. ఎంపికలకు వెళ్లాడు. 

ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లో ఏపీ జట్టుకు ఎంపికయ్యాడు. రాజస్తాన్‌లో నిర్వహించిన జాతీయస్థాయి వికలాంగుల క్రికెట్‌లోరాణించడంతో పాటు బెస్ట్‌ బౌలర్‌గా అవార్డు పొందాడు. అప్పటి నుంచి ప్రారంభమైన దేవరాజ్‌ ప్రస్థానం ఎందరో వికలాంగ క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలిచింది. శివకోటి లాంటి వారు జిల్లా నుంచి జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించడానికి స్ఫూర్తయింది.ఈయనతో పాటు మరికొందరు కలిసి దివ్యాంగుల క్రికెట్‌కు బీసీసీఐ గుర్తింపుకోసం శ్రమించారు. ఇప్పటి వరకు దీనికి బీసీసీఐ గుర్తింపు లభించనప్పటికీ దివ్యాంగుల క్రికెట్‌ను రానున్న రోజుల్లో బీసీసీఐలో విలీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా ఆంధ్ర క్రికెట్‌ సంఘం కూడా వీరి సంఘానికి చేయూతనిచ్చే దిశగా చర్యలు చేపట్టింది. 40 సంవత్సరాలు వయసు కలిగిన ఈయన ఇప్పటికీ క్రికెట్‌ ఆడుతూనే ఉండటం గమనార్హం. తాజాగా ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు అనంతపురంలోని ఆర్‌డీటీ మైదానంలో నిర్వహించనున్న నేషనల్‌ డిజేబుల్‌డ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఈయన ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఆయన అనంతపురం పయనమయ్యాడు. 

పొట్టకూటి కోసం..

బీసీసీఐ గుర్తింపు వికలాంగుల క్రికెట్‌కు లేకపోవడంతో ఈయనకు ఎన్నో అవార్డులు, సర్టిఫికెట్లు ఇచ్చినప్పటికీ అవేవీ స్పోర్ట్స్‌కోటా పరిధిలోకి రావు. అదే ఇతనికి శాపంగా మారింది. పదో తరగతి వరకు చదివిన ఏదైనా చిరుద్యోగమైనా కల్పించాలని గతంలో ఎందరో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించాడు. వారు ఈయన పరిస్థితిని చూసి జాలి పడి తాత్కాలికంగా ఎంతో సాయం చేసి తర్వాత చూద్దామని పంపించారే తప్ప కుటుంబపోషణకు శాశ్వత ఆధారమయ్యే ఉద్యోగ అవకాశం కల్పించలేదు. దీంతో పాటు ఇతని తల్లికి కూడా వైకల్యం ఉంది. కుటుంబపోషణ  కూడా దేవరాజ్‌పైనే పడింది.  భార్య, ఇద్దరు పిల్లలు తోడయ్యారు. పోషణ మరింత భారమైంది. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌ను ఓ వైపు సంసారాన్ని మరోవైపు నెట్టుకొచ్చేందుకు దోశల కొట్టును నడపుతున్నాడు. దోశలు, వడలు వేసుకుంటూ వచ్చిన దాంట్లో పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సారూ..
నేను పదోతరగతి పాసయ్యను. వైకల్యం ఉన్నప్పటికీ క్రికెట్‌లో చాలా ఏళ్లుగా ప్రతిభ కనబరిచా. అర్హతకు తగిన చిన్న ఉద్యోగమైనా ఇప్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని ఎన్నో మార్లు అధికారుల చుట్టూ తిరిగాను. జాలి చూపించి.. ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపిస్తున్నారు. బతుకు తెరువు కోసం దోశలు వేసుకుంటున్నాను. ప్రభుత్వం, అధికారులు స్పందించి చిరుద్యోగమైనా ఇప్పించి న్యాయం చేయాలి.
– పి. దేవరాజ్, క్రికెటర్, కడప

మరిన్ని వార్తలు