భారత్‌ విజయానికి ‘తోక’ పరీక్ష

6 Oct, 2019 13:11 IST|Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా సునాయాసంగా విజయం సాధిస్తుందనుకున్న తరుణంలో టెయిలెండర్లు పరీక్ష పెడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా టెయిలెండర్‌ ముత్తుస్వామి.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతనికి జతగా మరో టెయిలెండర్‌ పీయడ్త్‌ టీమిండియాకు విసుగుతెప్పిస్తున్నాడు. చివరి రోజు ఆటలో దక్షిణాఫ్రికా టాపార్డర్‌ కకావికలమైన సందర్భంలో వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. మంచి బంతుల్ని సమర్దవంతంగా ఎదుర్కొంటూ పెద్దగా ప్రమాదం లేదనకున్న బంతుల్ని బౌండరీలు దాటిస్తున్నారు.

దక్షిణాఫ్రికా 27 ఓవర్‌ ఐదో బంతికి ఎనిమిదో వికెట్‌ను కోల్పోతే, పీయడ్త్‌-ముత్తుసామి జోడి మాత్రం సవాల్‌ విసురుతోంది. ఈ జంట 25 ఓవర్లకు పైగా ఆడి 80 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచింది. లంచ్‌కు లోపే దక్షిణాఫ్రికా ఆలౌట్‌ అవుతుందని అనుకుంటే ముత్తుసామి-పీయడ్త్‌లు క్రీజ్‌ను వదలే ప్రసక్తే లేదు అనేంతంగా పాతుకుపోయారు. ఈ క్రమంలోనే పియడ్త్‌ 87 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అర్థ శతకం పూర్తి చేసుకోవడం విశేషం.

395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు వరుసగా వికెట్లను చేజార్చుకున్నారు. 11/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆటను కొనసాగించిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు బ్రయాన్‌ను రెండో వికెట్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు పంపి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.  ఆపై పేసర్‌ మహ్మద్‌ షమీ చెలరేగిపోయాడు. పిచ్‌ నుంచి బౌన్స్‌, స‍్వింగ్‌ రాబడుతూ దక్షిణాఫ్రికా టాపార్డర్‌ వెన్నువిరిచాడు. 40 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లను పెవిలియన్‌కు పంపడంతో దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. బావుమాను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపిన తర్వాత, డుప్లెసిస్‌, డీకాక్‌(0)లను షమీ ఔట్‌ చేశాడు.

ఇక అటు తర్వాత తన స్పిన్‌తో మాయాజాలం చేశాడు రవీంద్ర జడేజా. కాస్త వేగాన్ని జోడించి బంతిని రెండు వైపులకు తిప్పుతూ సఫారీలను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే మార్కరమ్‌(39),ఫిలిండర్‌(0), మహరాజ్‌(0)లను తొందరగా పెవిలియన్‌కు పంపాడు. ఒకే ఓవర్‌లో ఈ ముగ్గుర్నీ ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇన్నింగ్స్‌ 27 ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ మార్కరమ్‌ను ఔట్‌ చేసిన జడేజా.. అదే ఓవర్‌ నాల్గో బంతికి ఫిలిండర్‌ను ఔట్‌ చేశాడు. ఇక ఐదో బంతికి కేశవ్‌ మహరాజ్‌ను పెవిలియన్‌కు పంపడంతో సఫారీలు 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఈ తరుణంలో పీయడ్త్‌-ముత్తుసామిలు కీలకంగా మారిపోయారు.

మరిన్ని వార్తలు