-

నా కెప్టెన్సీపై ‘పిల్’ వేయాల్సిందే!

18 Jan, 2016 00:35 IST|Sakshi
నా కెప్టెన్సీపై ‘పిల్’ వేయాల్సిందే!

మెల్‌బోర్న్: కెప్టెన్‌గా తన పనితీరును అంచనా వేసేందుకు ఇక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయాలేమోనని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. వరుస పరాజయాలతో ధోని నాయకత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో అతను ఈ మాట అన్నాడు. ‘నా ప్రదర్శనను నేను సమీక్షిస్తే అది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అవుతుంది. కాబట్టి ఒక ‘పిల్’ దాఖలు చేసి నా కెప్టెన్సీ పనితీరును విశ్లేషించాలి’ అని అతను చెప్పాడు. బౌలింగ్‌లో అనుభవం లేకపోవడమే జట్టు ఓటమికి కారణమని కెప్టెన్ అభిప్రాయ పడ్డాడు.
 
 ఇషాంత్ సీనియర్ అయినా వన్డేల్లో పెద్దగా అనుభవం లేదని... ఉమేశ్ రెగ్యులర్ సభ్యుడు కాకపోగా, మిగతా వాళ్లంతా కొత్త కుర్రాళ్లేనని కెప్టెన్ గుర్తు చేశాడు. నాయకుడి స్థానంలో ఎవరున్నా జట్టు లోపాలు సరిదిద్దడం ముఖ్యమన్న ధోని, ఫీల్డింగ్ వైఫల్యం కూడా మూడో వన్డేలో ఓటమికి కారణమన్నాడు. ఆల్‌రౌండర్‌గా వారి నైపుణ్యం పరిశీలించేందుకే గుర్‌కీరత్, రిషి ధావన్‌లకు అవకాశం ఇచ్చామని, వారు ఆకట్టుకున్నారని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
 
 కోహ్లిపై ప్రశంసలు: విరాట్ కోహ్లిని చిన్న వయసు నుంచి చూస్తున్నానని, అతను కెరీర్‌లో ఎదిగిన తీరు అద్భుతమని ధోని ప్రశంసించాడు. ‘అతను ఇన్నేళ్లలో తన నైపుణ్యం మెరుగుపర్చుకుంటూ నిలకడగా ఆడాడు. భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో కోహ్లి ఒకడు. కోహ్లి టాపార్డర్‌లో పనికొస్తాడని గుర్తించడం నేను చేసిన మంచి పని. ఆ తర్వాత వచ్చిన ప్రతీ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. భవిష్యత్తులో సుదీర్ఘ కాలం పాటు భారత జట్టును ముందుకు నడిపించగల సత్తా అతనిలో ఉంది’ అని ధోని వ్యాఖ్యానించాడు.
 

మరిన్ని వార్తలు