ఫీజులు పెరుగుతాయ్‌!

1 Dec, 2017 01:02 IST|Sakshi

సీఓఏ, బీసీసీఐలతో క్రికెటర్ల చర్చలు సఫలం

ఎంత పెంచాలనేదానిపై త్వరలో నిర్ణయం

న్యూఢిల్లీ: భారత క్రికెటర్లకు శుభవార్త! ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ ఫీజులు త్వరలో పెరుగనున్నాయి. వార్షిక కాంట్రాక్టు చెల్లింపులు పెంచేందుకు కొత్త పరిపాలక కమిటీ (సీఓఏ), భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సానుకూలంగా స్పందించాయి. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, మాజీ కెప్టెన్‌ ధోని, కోచ్‌ రవిశాస్త్రిలు క్రికెట్‌ వర్గాలతో గురువారం ఇక్కడ సమావేశమయ్యారు. ఇందులో సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ, బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి పాల్గొన్నారు. ‘ఆటగాళ్లతో విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ఇందులో ఆడాల్సిన మ్యాచ్‌ల సంఖ్య, భవిష్యత్‌ పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ), వేతన భత్యాలపై కూలంకషంగా చర్చించాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కెప్టెన్, కోచ్‌లు త్వరలోనే మాకు అందజేయగానే తుది నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్లకు ఆటే కాదు... విశ్రాంతి కూడా అవసరమే’ అని వినోద్‌ రాయ్‌ అన్నారు.

ఎంత పెరిగేది కచ్చితంగా చెప్పనప్పటికీ పెంపు మాత్రం అనివార్యమని ఆయన పేర్కొన్నారు. ఆడుతున్న మ్యాచ్‌లకు, చెల్లిస్తున్న పారితోషికాలకు మధ్య ఆర్థిక సమతౌల్యం తెస్తామని చెప్పారు. ప్రస్తుతం ‘ఎ’ గ్రేడ్‌ ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులో భాగంగా రూ. 2 కోట్లు.. బి, సి గ్రేడ్‌ ఆటగాళ్లకు వరుసగా రూ. కోటి, రూ. 50 లక్షలు చెల్లిస్తున్నారు. టెస్టులాడే తుది జట్టు సభ్యులకు రూ. 15 లక్షల చొప్పున, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20లకైతే రూ.3 లక్షల చొప్పున ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజుగా ఇస్తున్నారు. తుది జట్టులో లేని ఆటగాళ్లకు అందులో సగం మొత్తాన్ని ఇస్తారు. దీనిపై  ఈ నెల 11న జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్‌)లో తుది నిర్ణయం వెలువడనుంది. 

మరిన్ని వార్తలు